నార్మన్ ఫోస్టర్ అమరావతిలో మరొక ప్రయోగం చేయాలనుకుంటున్నారు. ఒక ప్రయోగం విఫలమయింది ,యుఎఇలోని మస్దార్ లో. ఎడారిలో కాలుష్యమేలేని అధునాతన పర్యావరణ స్వర్గంగా మస్దార్ ను డిజైన్ చేశారు. అక్కడ క్లీన్ ఇండస్ట్రీస్ మాత్రమే వస్తాయి. నగరం నడిచేది సౌర విద్యుత్తు,పవన్ విద్యుత్తుతోనే. డ్రయివర్ లేని విద్యుత్ కార్లే రోడ్లమీద తిరుగుతాయి. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఈ ఫ్యూచరిస్టిక్ సిటిని కట్టాలనుకున్ని 2006లో పునాది వేశారు. పదేళ్లలో పూర్తి చేయాలనుకున్నారు. పదేళ్లయిపోయింది. ఈరోజు ప్రపంచలోనే ఇదొక అరుదైన నగరంగా మిగిలిపోయిన మాట వాస్తవం- కాని అది శూన్య మహానగరం. ఇంకా పూర్తికాలేదు. పూర్తవుతుందన్ననమ్మకం లేదు.భవనాలు ఖాళీ,రోడ్లు ఖాళీ. జనం లేరు.

నార్మన్ ఫోస్టర్ అమరావతి రాజధాని నగరాన్ని డిజైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంట్రాక్టను చాలా అట్ట హాసంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ కు చెందిన ఈ కంపెనీకి అప్పచెప్పారు. ఫారినోళ్లంటే మనకు భయం భక్తి ఉంటాయి కాబట్టి, వాళ్ల గొప్పలే తప్ప వైఫల్యాలెపుడూ చర్చించుకోం. రాజధాని నగర నిర్మాణం ఒక రాజకీయ ప్రాజక్టు. దాని సెలక్షన్, అక్కడి భూముల సేకరణ, రాజధాని పక్కన భూముల కొనుగోళ్లు, ఇన్ సైడర్ ట్రేడింగ్ రాజధానిలో చవగ్గా ఎవరికి భూములివ్వాలి,, ఎవరు రాజధాని నిర్మించాలి అనేవన్నీ కూడా రాజకీయ నిర్ణయాలే. నార్మన్ ఫోస్టర్ డిజైనర్ ఎంపిక కూడా రాజకీయాలకు అతీతంగా జరిగిందనుకోడానికి వీల్లేదు. ఇవి ఇపుడు బయటకు రాకపోవచ్చు.

అయితే, నార్మన్ ఫోస్టర్ డిజైనర్ గురించి ఒక విచిత్రమయిన వాస్తవాన్ని కాలిఫోర్నియా సండే మ్యాగజైన్ మే 29 సంచిక లో బయటపెట్టింది. ఈ పత్రిక కరెస్సాండెంట్ రోలో రోమిగ్ విజయవాడ వచ్చి, రైతులతో అధికారులతో మాట్లాడి అమరాతి భవిషత్తు నగరాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నారో ఒక వ్యాసం రాశారు. ఫ్యూచరిస్టిక్ సిటిగా అమరాతిని కట్టాలనుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నార్మన్ ఫోస్టర్ ను డిజైనర్ గా ఎంపిక చేశారు. అయితే, ప్రపంచంలో ఏ నగరం ప్లానర్స్ కలలు ప్రకారం,డిజైనర్లు గీచిన గీతల ప్రకారం పెరగలేదు. కలలు భగ్నం చేసి, గీతలను చెరిపేసుకుని ఎలా అదుపులో లేకుండా ఆధునిక నగరాలు పెరిగిపోతున్నాయో రోమిగ్ తను అధ్యయనం అనుభవం జోడించి రాశారు. ఈ సందర్భంగా ఆయన నార్మన్ ఫోస్టర్ ఘోరంగా విఫలమయిన తాజా పాజక్టును ఉదహరించారు. ఆ ప్రాజక్టేమిటో కాదు, అబుదాబి ప్రభుత్వం నిర్మించాలను కున్న ఫ్యూచరిస్టిక్ మహానగరం, మస్దార్. ఆంధ్ర అధికారులు మస్దార్ ను అనేక సార్లు పరిశీలించి వచ్చారు. ఎపుడూ ఈ విఫల నగరం గురించి విషయాలు వెల్లడించలేదు.
ప్రపంచంలో ఇదొక్కటే ఈ తరహా నగరం. ఎడారిలో ఒక పర్యావరణ స్వర్గంలాగా మస్దార్ ను నిర్మించాలనుకున్నారు. ప్రపంచంలో పూర్తిగా కార్బన్ లేని మెట్రో నగరంగా దీనిని తీర్చిదిద్దాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలకంది. దీనిని నిజంచేసే ప్రణాళిక ఇవ్వాలని నార్మన్ ఫోస్టర్ ను కోరారు. అక్కడ క్లీన్ ఇండస్ట్రీస్ మాత్రమే వస్తాయి. నగరం నడిచేది సౌర విద్యుత్తు,పవన్ విద్యుత్తుతోనే. డ్రయివర్ లేని విద్యుత్ కార్లే రోడ్లమీద తిరుగుతాయి. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఈ ఫ్యూచరిస్టిక్ సిటిని కట్టాలనుకుని 2006లో పునాది వేశారు.
పదేళ్లలో పూర్తి చేయాలనుకున్నారు. పదేళ్లయిపోయింది. ఈ రోజు ప్రపంచలోనే ఇదొక అరుదైన నగరంగా మిగిలిపోయిన మాట వాస్తవం- కాని అది శూన్య మహానగరం. కట్టిన బిల్డింగులన్నీ ఖాళీ. రోడ్ల మీద కార్లులేవు, నగరంలో మనుషులెవరూ కనిపించరు. ఎవరూ అక్కడికి రావడం లేదు. నగరాన్నెవరో ఖాళీ చేసి పారిపోయినట్లు, అంతా శూన్యం. నగరంలో అనేక చోట్ల అభివృద్ధి ప్రాజక్టులు మొదలు కాకపోవడంతో ఇసుక తిన్నెలు పెరగడం కనిపిస్తుంది. వాహన కాలుష్యమే ఉండదనుకున్న ఈ మహానగరం, ఇపుడు పిచ్చిపిచ్చికలల వైఫల్యానికి గుర్తుగా నిలబడి ఉంది. ప్రపంచంలో తొలి అసంపూర్ణ నగరంగా మిగిలి పోయింది. నార్మన్ ఫోస్టర్ డిజైన్ వైఫల్యానికి మచ్చుతునక గా వెక్కిరిస్తూ ఉంటుంది.
ఈ పిచ్చి కలల కుక్క మూతి పిందెని 2016జూన్ లో ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ ఇచియెన్ మాలపెర్ట్ పోటోలకెక్కించారు.

ఇపుడు ఈ నగరంలో కేవలం 282 మంది మాత్రమే నివసిస్తున్నారు. నిజానికి నగరం తయారయ్యే నాటికి ఇక్కడ 50వేల జనాభా నివసిస్తూ ఉండాలి. 40వేల మంది రోడ్ల మీద ప్రయాణిస్తూ ఉండాలి. ఇపుడు ఇక్కడ ఉంటున్న వారు కూడా అక్కడి మస్దార్ ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ లో చదువుకునే విద్యార్థులే. అన్ని నిగనిగలాడే భవంతులైనా మనుషులెవరూ కనిపించరు. నిర్మానుష్య మయన వీధులలో ఇపుడు తిరుగుతున్నవి ఇసుకుతుఫానులే. మస్దార్ దిష్టిబొమ్మ ఫోటోలను మాలపెర్ట్ ఒక పుస్తకంగా కూడా అచ్చేశారు.

పెట్రోల్ వంటి కార్బన్ కాలుష్యం కలిగించే ఇంధనం నుంచి కాకుండా సౌర,పవన విద్యుత్ ను మాత్రమే వాడుకునే ఒక నగరం కట్టాలన్న యుఎఇ కల ఇలా భగ్నమయింది. మస్దార్ ఇపుడు ఘోస్ట్ సిటీ గామారిందని గార్డియన్ వ్యాఖ్యానించింది.

వస్తానన్న ఇన్వెస్టర్లెవరూ రాలేదు, ప్రాజక్టుల ఎంవొయు లేవీ అమలుకాలేదు. పెట్టిన ఖర్చు దాదాపు 20 బిలియన్ డాలర్లు వృధా అయిపోయాయి. అయితే యుఎఇ అధికారులెవరూ ఓటమి అంగీకరించే స్థితిలో లేరు. ప్రాజక్టు ఆగిపోలేదు, పూర్తి చేస్తామని చెబుతూ నే ఉన్నారు. అయితే, అనుకున్నట్లు ఒక వేళ వచ్చినా, రాబోయేది, కలలు నగరం కాదు మమూలు నగరమే...
నార్మన్ ఫోస్టర్ పేరు విన్నపుపుడల్లా మస్దార్ గుర్తుకు వస్తుంది తెలిసిన వాళ్లకు. అమరావతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నమాటలే 2006లో యుఎఇ అధికారులు చెప్పారు. అమరావతి మరొక మస్దార్ కాకూడదని కోరుకుందాం.
