రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి సొంత నియోజకవర్గం నుంచే చుక్కెదురైంది ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి సొంత నియోజకవర్గం నుంచే చుక్కెదురైంది. ఆమె తాజాగా.. వైసీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె పార్టీ ఫిరాయించడం నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై రంపచోడవరం ఎంపీపీ ఆరగాటి సత్యనారాయణ రెడ్డి, డివిజన్ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు రామకృష్ణ దొర మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎన్ని కోట్లను అమ్ముడుపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘టీడీపీ తనకు రూ.20కోట్లు ఇస్తామని ఆశచూపారని.. అయినప్పటికీ తాను పార్టీ మారనని’’ ఎమ్మెల్యే రాజేశ్వరి చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదే విషయాన్ని ఎంపీపీ ప్రస్తావించారు. ఎక్కువ బేరం కుదరడం వల్లే ఎమ్మెల్యే పార్టీ మారారని విమర్శించారు. పార్టీ మారే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉంటే బాగుండేదని సూచించారు. రాజేశ్వరి పార్టీ మారినంత మాత్రాన తమ ప్రాంతానికి వచ్చిన నష్టం ఏమీ లేదని ధీమా వ్యక్తం చేశారు.