కేవలం ఒకే ఒక్క రూపాయి కోసం ఓ వ్యక్తి.. మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థానే నగరంలోని కళ్యాణ్ పట్టణానికి చెందిన మనోహర్(54) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం కోడిగుడ్లు కొనేందుకు ఇంటికి సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లాడు. కోడిగుడ్లు కొన్న తర్వాత దుకాణం యజమానికి డబ్బులు చెల్లించాడు. అయితే.. ఒక రూపాయి తక్కువగా చెల్లించాడు. ఈ విషయంలో మనోహర్ కి  దుకాణ యజమాని సుధాకర్ ప్రభు(45) కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

సుధాకర్ కాస్త డోస్ పెంచి.. మనోహర్ ని అభ్యంతకర పదజాలంతో దూషించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన మనోహర్ ఇంటికి వెళ్లి.. తన కుమారుడిని తీసుకోని వచ్చి మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ సారి గొడవ మరింత తీవ్రతరం కావడంతో సుధాకర్.. మనోహర్ పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీంతో.. ఒక్కసారిగా మనోహర్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధాకర్ ని అదుపులోకి తీసుకున్నారు.