Asianet News TeluguAsianet News Telugu

మోడీజీ....ఇది విన్నారా ?

ఏ ప్రభుత్వమైనా కుబేరులకు మేలు చేయటానికే సర్వశక్తులూ ఒడ్డుతున్నపుడు ఇక కుబేరులు మరింత కుబేరులుగాను పేదలు మరింత పేదలుగాను మారటంలో ఆశ్చర్యమేముంది?

3 billionaires tops the wealth in India

దేశంలో పేదరికనిర్మూలన కోసం కృషి చేస్తున్నట్లు చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి వినితీరాల్సిన విషయమే ఇది. ఇంతకీ విషయమేమిటంటే, దేశంలోని కుబేరులు-పేదల మధ్య అంతరరం బాగా పెరిగిపోతోందని. కారణాలేవైనా కుబేరులు మరింత కుబేరులుగాను, పేదలు అత్యంత పేదలుగాను మారిపోతున్నారని. ఈ విషయం ఏ కాంగ్రెస్ పార్టీనో లేక మరేదో ప్రతిపక్షమో చెప్పింది కాదు. స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు సందర్భంగా ‘ఆక్స్ ఫామ్’ అనే సంస్ధ వెల్లడించిన విషయాలివి.

 

దేశం మొత్తం మీద సంపద 3.1 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో చివరినుండి 70 శాతంమంది జనాభా సంపద 216 లక్షల కోట్ల డాలర్లైతే, 57 మంది సంపద కూడా దాదాపు 216 లక్షల కోట్ల డాలర్లే.  ఇందులో కూడా 84 మంది కుబేరుల సంపద 248 బిలియన్ డాలర్లట. వీరిలో కూడా మొదట ముగ్గురి సంపదా వరుసగా ముఖేష్ అంబానీ( 19.3 బిలియన్ డాలర్లు), సన్ ఫార్మా దిలీస్ సంఘ్వి (16.7 బిలియన్ డాలర్లు)విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ (15 బిలియన్ డాలర్లు).

 

ధనవంతులు మరింత ధనవంతులుగాను పేదలు మరింత పేదలుగాను మారిపోవటానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణాలని వేరే చెప్పకర్లేదు. కేంద్రంలో ప్రభుత్వం ఏదైనా కుబేరుల కొమ్మే కాస్తున్నాయి. దాంతో వారి సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. రైతులకు, పేదలకు సబ్సిడీలు ఇవ్వటానికి సవాలక్ష అడ్డంకులు చెప్పే ప్రభుత్వాలు కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లను రాయితీల పేరుతో ఎటువంటి మొహమాటం లేకుండా దోచిపెడుతున్నాయి.

 

పోయిన ఏడాది నవంబర్ లో జరిగిన నోట్ల రద్దే పెద్ద ఉదాహరణ. నోట్ల రద్దైన దగ్గర నుండి దేశంలోని ప్రజలందరూ ఏటిఎంలు, బ్యాంకుల ముందు వారాల తరబడి పడిగాపులు పడ్డారు. అయితే దేశంలో పేరున్న ఒక్క కుబేరుడు కూడా డబ్బుల కోసం ఎక్కడా క్యూలైన్లలో నిలబడలేదు. పైగా పలువురికి ఏకంగా వారి ఇళ్ళకే కోట్ల కొద్దీ కొత్త నోట్లు పరుగులు పెట్టిన సంగతి అందరూ చూసిందే.

 

మోడి గద్దెనక్కెనిప్పటి నుండి దేశంలో పేదరికం పోగొడతానని, పేదల కష్టాలు తీరుస్తాననే మాటలు చెప్పటమే కానీ ఆచరణలో ఒక్కటి కనబడలేదు. పైగా ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఓ వైపు అంబానీ మరోవైపు అదానిని వెంటేసుకునే తిరుగుతున్నారు. కుబేరులు బ్యాంకుల్లో తీసుకున్న లక్షల కోట్ల రుణాలను ఎగ్గొడుతున్నా పట్టించుకోవటం లేదు. ఏ ప్రభుత్వమైనా కుబేరులకు మేలు చేయటానికే సర్వశక్తులూ ఒడ్డుతున్నపుడు ఇక కుబేరులు మరింత కుబేరులుగాను పేదలు మరింత పేదలుగాను మారటంలో ఆశ్చర్యమేముంది?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios