కేవలం ఒకే ఒక్క వ్యక్తి కారణంగా.. 21మంది జీవితాలు నాశనమయ్యాయి. అతను చేసిన తప్పిదం వల్ల 21మందికి హెచ్ఐవీ సోకింది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బంగార్ మౌ ప్రాంతంలో  ఇటీవల ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో మొత్తం 566 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా.. వారిలో 21 మంది హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది.

ఒకే ప్రాంతంలో ఇంత ఎక్కువ మంది హెచ్‌ఐవీ బారిన పడటంతో అనుమానం వచ్చిన ఆరోగ్యశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఇందుకోసం ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటుచేశారు. ఈ కమిటీ బంగార్‌మౌలోని ప్రేమ్‌గంజ్‌, చక్మీర్‌పూర్‌ ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది. ఈ నివేదిక చూసి అధికారులు నివ్వెరపోయారు.

ఈ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామంలో రాజేంద్ర కుమార్‌ అనే నకిలీ డాక్టర్‌ తక్కువ ఫీజుకే వైద్యం పేరుతో ప్రాక్టీస్‌ పెట్టాడు. అతడి దగ్గరకు వచ్చే రోగులకు ఒకే సిరంజీతో ఇంజక్షన్‌ చేసేవాడు.  ఆయన ఇంజక్షన్ చేసిన వారిలో ఒకరికి ఎయిడ్స్ ఉండి ఉంటుంది. అది గమనించకుండా... అందరికీ అదే ఇంజక్షన్ ఉపయోగించాడు.దీని కారణంగానే వారందరికీ హెచ్‌ఐవీ సోకినట్లు నివేదికలో తేలింది. దీంతో సదరు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. బాధితులను చికిత్స నిమిత్తం కాన్పూర్‌కు తీసుకెళ్లారు.