యూపీలో ప్రసిద్ధ నగరం, ఆ రాష్ట్ర రాజధాని లక్నో పేరు త్వరలోనే లక్ష్మణ్ జీ గా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ వాదనకు యూపీ సీఎం చేసిన ట్వీట్ ఊతమిస్తోంది. ప్రధానికి స్వాగతం పలుకుతూ చేసిన ట్వీట్ లో ఆయన లక్నో పేరును లక్ష్మణ్ జీగా ఆయన అభివర్ణించారు. 

యూపీ రాజ‌ధాని ల‌క్నో న‌గ‌రం పేరును యోగి ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే మార్చ‌నుందా ? ఆ రాజ‌ధానికి ల‌క్ష్మ‌ణ్ జీ అనే పేరును ఖ‌రారు చేసిందా ? ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం అవుననే వినిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ట్వీట్ దీనికి మ‌రింత బ‌లం చేకూరుస్తోంది. పేరు మార్పు విష‌యంలో గ‌తంలో ఎన్నో చ‌ర్చ‌లు జ‌రిగినా సీఎం నుంచి ఇలాంటి ట్వీట్ రావ‌డం ఇదే తొలిసారి. 

Hard Work: ముంబయిలో పూవులు అమ్ముకునే అమ్మాయికి యూఎస్ టాప్ వర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త‌న ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘‘ లక్నోలోని శేషావతార్ లార్డ్ లక్ష్మణ్ జీ పవిత్ర నగరానికి స్వాగతం ’’ అంటూ ట్వీట్ చేశారు. అమౌసీ విమానాశ్రయంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్నప్పుడు తీసిన చిత్రాన్ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ల‌క్నో పేరు మార్పు ఖాయమ‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో లక్నో పేరును లఖన్‌పురి, లక్ష్మణపురి, లఖన్‌పూర్‌గా మార్చాలనే డిమాండ్ చాలా సార్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో సీఎం ట్వీట్ తో చ‌ర్చ మ‌ళ్లీ మొద‌లైంది. 

Scroll to load tweet…

ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం లక్నోలో ఒక గొప్ప లక్ష్మణ‌ ఆలయాన్ని నిర్మిస్తోంది. ఈ ఆల‌యం ఎత్తు 81 అడుగులు. ఆలయ నిర్మాణం పూర్తి అవ్వ‌డానికి ఐదేళ్ల సమయం పడుతుంది. వాస్తు నిబంధ‌న‌లకు అనుగుణంగా దీనిని నిర్మిస్తున్నారు. అయోధ్య న‌గ‌రం లక్నో నుండి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే లక్నోలో శ్రీరాముడి త‌మ్ముడైన లక్ష్మణుడు స్థిరపడ్డాడని చెబుతుంటారు. గ‌తంలో లక్నో నుంచి ఎంపీ, మాజీ మంత్రి అయిన బీజేపీ ప్రముఖ నాయకుడు లాల్జీ టాండన్ తన పుస్తకంలో లక్నోను లక్ష్మణ్ నగరిగా అభివర్ణించారు. లక్నోలో లక్ష్మణ్ తిలా, లక్ష్మణ్ పూరి, లక్ష్మణ్ పార్క్ వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌త ఘ‌ర్ష‌ణ‌.. హ‌నుమాన్ విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న స‌మ‌యంలో ఉద్రిక్త‌త‌.. 144 సెక్ష‌న్ విధింపు..

2017లో యూపీ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా మొఘల్‌సరాయ్ స్టేషన్ పేరును యోగి స‌ర్కార్ మార్చింది. దీనికి 2018 ఆగస్టు లో యోగి ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించడంతో మొఘల్‌సరాయ్ స్టేషన్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ స్టేషన్‌గా మారింది. ఇది మాత్ర‌మే కాదు దీని తర్వాత యోగి క్యాబినెట్ మొఘల్‌సరాయ్ తహసీల్ పేరును పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ తహసీల్‌గా మార్చింది. దీంతో పాటు ఫైజాబాద్ జిల్లా పేరును కూడా యోగి ప్రభుత్వం అయోధ్యగా మార్చింది. అంటే ఫైజాబాద్ జిల్లా కిందకు అయోధ్య నగరం చేర్చి, దాని రూపురేఖలు మార్చారు. జిల్లా మొత్తాన్ని అయోధ్యగా మార్చారు. 

ఫైజాబాద్ రైల్వే స్టేషన్ ను అయోధ్య కంటోన్మెంట్ గా, అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చింది. అలాగే యోగి ఆదిత్యనాథ్ బదౌన్ జిల్లా పేరును వేదమౌగా మార్చాలని సూచించారు. దీంతో పాటు సుల్తాన్ పూర్, మీర్జాపూర్, అలీగఢ్, ఫిరోజాబాద్, మెయిన్ పురి పేర్లను మార్చాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పేర్లు మార్పు ప్ర‌క్రియ‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే, సుల్తాన్ పూర్ పేరు కుష్ భవన్ పూర్ గా, మెయిన్ పురి పేరు మాయన్ నగర్ గా, అలీఘర్ పేరు హరిఘర్ గా, ఫిరోజాబాద్ పేరు చంద్ర నగర్ గా, మీర్జాపూర్ పేరు వింధ్య ధామ్ గా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. అలాగే ముజఫర్ నగర్ ను లక్ష్మీ నగర్ గా, ఆగ్రాను అగ్రవన్ గా, మియాన్ గంజ్ ను మాయాగంజ్ గా మార్చే అవ‌కాశం ఉంది.