ఆమె ముంబయిలో పూవులు అమ్మేది. తండ్రితో కలిసి పూల మాలలు అల్లి విక్రయించేది. ముఖ్యంగా గణేష్ చతుర్ది, దసరా దీపావళి వంటి పండుగలు మరింత కష్టపడేది. అలాంటి అమ్మాయి అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేయడానికి పీహెచ్‌డీ అడ్మిషన్ పొందింది. డిగ్రీ తర్వాత ఎంఏ, ఎంఫిల్ జేఎన్‌యూలో చేసింది. జేఎన్‌యూలో చేరడమే తన లైఫ్ టర్నింగ్ పాయింట్ అని ఆమె చెబుతుంది.
న్యూఢిల్లీ: జీవితంలో కష్టాలు ఒక వైపు.. ఆశలు మరో వైపు. సమస్యలు ఒక వైపు.. ఏదైనా సాధించాలన్న ఆరాటం, తపన మరో వైపు. ఇలాంటి మేళవింపులు నిత్యం ఉండే కుటుంబంలో ఆ అమ్మాయి జన్మించింది. మూడు పూటల వేళ్లు నోట్లోకి వెళ్లాలంటే.. రోజంతా పని చేయకతప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి తండ్రితో కలిసి పూవులు అమ్మడంలో సహకరించేది. పూల మాలలు అల్లి మార్కెట్లో అమ్మేది. ముఖ్యంగా గణేష్ చతుర్ది, దీపావళి, దసరా వంటి పెద్ద పండుగలు వచ్చినప్పుడు ఆమె తప్పనిసరిగా తండ్రి వ్యాపారంలో భాగస్వామి అయ్యేది. ఇలా ఇల్లు గడవడానికి ఆర్థిక కష్టాల్లో భాగస్వామ్యం తీసుకున్న ఆ అమ్మాయి ఇప్పుడు అమెరికా టాప్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ సాధించింది. ఆమె పేరే సరిత మాలి.
స్వాతి మాలి సొంతూరు జాన్‌పుర్‌లోని స్వగ్రామం బద్లాపూర్. తల్లి, తండ్రి, ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లు.. మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు. ముంబయి వలస వెళ్లి పూల వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని సాకుతున్నాడు. ఏదైనా సాధించాలనే తపన సరిత మాలిలో ఎక్కువ. చదవడమే అందుకు మార్గం. ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపి అనేక అవకాశాలకు వారధిలా నిలిచే విద్యా సంస్థ పేరు ఆమె చెవిన పడింది.
జేఎన్‌యూ వెళ్లిన వారు ఎవరైనా సరే.. వారు ప్రత్యేకంగా నిలుస్తారనే మాట వారి బంధువుల నోట ఆమె విన్నది. ఎలాగైనా సరే ఆ యూనివర్సిటీలో సీటు సంపాదించాలని 2010లోనే స్వాతి మాలి గోల్ పెట్టుకున్నది. అప్పటి నుంచి ఆమె నిత్యం జేఎన్‌యూ పేరును స్మరించేది. ఆమె తన బీఏ ఫస్ట్ ఇయర్‌లోకి వెళ్లినప్పటి నుంచి జేఎన్‌యూ ప్రవేశం కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టింది. 2014లో ఆమె జేఎన్‌యూ ఎంట్రెన్స్ రాసింది. పీజీలో ఓబీసీ కోటాలో చివరి సీటు ఆమెకు దక్కింది.
ఈ యూనివర్సిటీనే తన జీవితాన్ని మార్చేసిందని సరిత మాలి తరుచూ చెబుతుంటుంది. ఒక్కోసారి తాను కలలో జీవిస్తున్నానా? అనిపిస్తుందని, కానీ, ఇప్పుడు తనపై బాధ్యతలు పెరిగాయని వివరించింది. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఒకసారి ఇప్పుడు చూస్తే.. తన ప్రయాణాన్ని ఇప్పుడు తాను నమ్మలేకపోతుంటానని చెప్పింది. ఒక వేళ జేఎన్‌యూ అనేదే లేకుంటే ఇప్పుడు నేను ఎక్కడ ఉండేదానినో అని తెలిపింది. జేఎన్‌యూకు వచ్చిన తర్వాతే తనపై విశ్వాసం ఏర్పడిందని పేర్కొంది. ఎన్నో విజయాలను సాధించవచ్చనే నమ్మకం ఇక్కడే ఏర్పడిందని తెలిపింది. అందుకే ఆమె ఇలాంటి ప్రభుత్వ యూనివర్సిటీలను మరిన్ని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరింది.
జేఎన్‌యూలో సరిత మాలి ఒక యువ పరిశోధకురాలు. ఆమె జేఎన్‌యూలో ఎంఏ చేసిన తర్వాాత ఎంఫిల్ కూడా చేసింది. ఆ తర్వాత ఆమె టాప్ అమెరికా యూనివర్సిటీకి దరఖాస్తు చేసింది. అందులోనూ పీహెచ్‌డీ చేయడానికి అడ్మిషన్ పొందింది.
