కోల్ కతా: సీఏఏను, ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని తలపెట్టిన బిజెపి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెసు నేత అధీర్ రంజన్ చౌధురి విరుచుకుపడ్డారు. వాటిని తాము వ్యతిరేకిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. 

"ఔను, నేను పాకిస్తానీనే. బిజెపి వాళ్లు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీకు ఎవరూ భయపడడం లేదను. రంగా, బిల్లా ఢిల్లీలో కూర్చుని ఏమైనా చెబుతారు. వాటిని మేం అంగీకరించాలి. లేకుంటే ద్రోహులుగా జమకడుతారు" అని చౌధురి అన్నారు. 

Also Read: సిఏఏ ఎఫెక్ట్: ప్రధాని మోడీకి రామకృష్ణ మఠం షాక్.

కోల్ కతాలోని నార్త్ 24 పరగణాల జిల్లాలో గల బసిర్హత్ లో గురువారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెసు నేత చౌధురి ఆ వ్యాఖ్యలు చేశారు. ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల వ్యక్తిగత ఆస్తి కాదని ఆయన అన్నారు. 

అర్జునుడి బాణాలకు అణుశక్తి ఉందని పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ దంఖార్ చేసిన ఇటీవలి వ్యాఖ్యలపై కూడా ఆయన మండిపడ్డారు. తన వ్యాఖ్యలను సమర్థించకుంటూ గవర్నర్ తాను భారత చరిత్ర, సంస్కృతుల గురించి మాత్రమే మాట్లాడానని అన్నారు. 

Also Read: కేంద్రానికి షాక్: సీఏఏపై సుప్రీంకోర్టుకెక్కిన కేరళ సర్కార్

గవర్నర్ పూర్తిగా బుద్ధిని కోల్పోయినట్లు ఉన్నారని చౌధురి వ్యాఖ్యానించారు. అర్జునుడి బాణానికి అణుశక్తి ఉఇంటే దానిపై పరిశోధనలు చేయాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో నోబెల్ బహుమతి పొందిన ఐదుగురు పుట్టారని, బెంగాల్ కే చెందిన దంఖార్ ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రానికే అప్రతిష్ట అని ఆయన అన్నారు. 

సిఏఏ, ఎన్ఆర్సీల వంటి అంశాలను లెవనెత్తుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ విస్తృతమైన ప్రచారం సాగిస్తోంది.