కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ చట్టం రాజ్యాంగంలోని సమానత్వ హక్కుతో పాటు పలు ఆర్టికల్స్‌ను ఉల్లంఘిస్తోందని కేరళ తన పిటిషన్‌లో పేర్కొంది.

Also Read:ప్రధాని మోడీ తో మమత బెనర్జీ భేటీ: ఎన్ఆర్‌సీ, సీఏఏ లను ఉపసంహరించమని కోరిన దీది

రాజ్యాంగంలో ప్రాథమికంగా పేర్కొనే సెక్యులరిజమ్‌కు వ్యతిరేకంగా ఈ చట్టం ఉందని ఆ పిటిషన్‌లో ప్రస్తావించంది. కాగా ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు మొత్తం 60 పిటిషన్లు దాఖలయ్యాయి.

సీఏఏపై న్యాయస్థానంను ఆశ్రయించిన రాష్ట్రాల లిస్ట్‌లో కేరళ ముందు వరుసలో నిలిచింది. కాగా ఇప్పటికే ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు సీఏఏ చట్టంపై కేరళ ప్రభుత్వ వైఖరిని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా స్వయంగా ప్రభుత్వమే ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

Also Read:అమ్మాయిలను ఎర వేస్తున్నారు: మోడీ షాకింగ్ కామెంట్స్

పార్లమెంట్ ఆమోదించిన ఓ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఖజానాలోని నిధులను ఎలా ఖర్చు చేస్తారంటూ ఆరిఫ్ ప్రశ్నించారు. సీఏఏకి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం పలు దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తోందంటూ వచ్చిన వార్తలపై గవర్నర్ స్పందించారు. ఇలాంటి చర్యలకు ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన మండిపడ్డారు.