ఈ ఏడాదిలో సింహభాగం విషాదాలే ఉన్నప్పటికీ ఒలంపిక్‌లో స్వర్ణం గెలుపొందడం వంటి కొన్ని సంతోషకర విషయాలూ ఉన్నాయి. కరోనా మహమ్మారికి కళ్లెం వేయడానికి టీకా పంపిణీ ఈ ఏడాదిలోనే ప్రారంభమైంది. అనంతరం సెకండ్ వేవ్ విలయం సృష్టించింది. రైతుల చారిత్రక ఆందోళనలు, నాగాలాండ్‌లో పౌరులపై భద్రతా బలగాల కాల్పులు సహా మరెన్నో ముఖ్య విషయాలు ఈ ఏడాదిలో చోటుచేసుకున్నాయి.
న్యూఢిల్లీ: ప్రతి ఏడాది కొన్ని మధుర స్మృతులను, విషాదాలను(Tragedy), బాధలను మిగిల్చి వెళ్లిపోతుంది. కానీ, ఈ ఏడాది ఎక్కువగా విషాదాలనే అందించింది. లక్షలాది మంది ఆప్తులను ఈ ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా కోల్పోయాం. చరిత్రలో దీర్ఘకాలం నిలిచిపోయే కరోనా మహమ్మారితోపాటు మరికొన్ని కీలక పరిణామాలు ఈ ఏడాదిలో జరిగాయి. క్లుప్తంగా ఈ ఏడాదిలో చోటుచేసుకున్న ప్రధాన విషయాలను(Year Roundup) ఓ సారి మననం చేసుకుందాం. ఈ విషయాలనూ మదిలో పెట్టుకుని నూతన ఆశలు, ఆశయాల, పాజిటివ్ థింకింగ్‌తో నూతన సంవత్సరంలోకి అడుగిడుదాం.
టీకా పంపిణీ:
కరోనా వైరస్ మన దేశంలోకి ప్రవేశించిన సుమారు సంవత్సరం తర్వాత ఈ ఏడాది జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఒకటైన భారత్ ఈ ఏడాది జనవరి 16న కరోనా టీకా పంపిణీని ప్రారంభించింది. హెల్త్ కేర్, శానిటైజేషన్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలిగా టీకాలు పంచారు.
రైతుల మార్చ్.. ఎర్రకోటపై అలజడి:
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దులో ధర్నాకు వచ్చిన రైతులు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ఢిల్లీకి ట్రాక్టర్ మార్చ్ చేపట్టారు. ఇందులో ఓ గుంపు ముందుగా నిర్దేశించిన దారిలో కాకుండా ఎర్రకోటవైపు వెళ్లింది. చాలా చోట్ల పోలీసు బారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ మార్చ్ జరిగింది. పోలీసుల లాఠీ చార్జ్ ఎక్కువగా జరిగింది. ఎర్రకోటపైనా కలకలం రేగింది. భద్రతా సిబ్బందిని లెక్క చేయకుండా రైతుల్లో కొందరు ఎర్రకోట ఎక్కారు.
Also Read: Roundup 2021: ఈ ఏడాదిలో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే..!
మావోయిస్టులతో ఎన్‌కౌంటర్.. 22 మంది జవాన్ల వీరమరణం:
ఛత్తీస్‌గడ్ బీజాపూర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టు నేత హిడ్మా సారథ్యంలో ఓ మావోయిస్టు గుంపు ఉన్నదనే ప్రాథమిక సమాచారంతో భద్రతా బలగాలు అడవి లోపలికి వెళ్లింది. అప్పుడే ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 22 మంది జవాన్లు వీరమరణం పొందారు.
సెకండ్ వేవ్ విలయం:
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఏప్రిల్, మే నెలల్లో విలయ తాండవం చేసింది. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 1.69 లక్షల మంది ఆప్తులను పొట్టనబెట్టుకుంది. ఆక్సిజన్ అందక కొట్టుమిట్టాడిన వారి వేదన భరిత జ్ఞాపకాలు ఇంకా తడిగానే ఉన్నాయి.
ప్రకృతి వైపరిత్యాలు:
ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో చమోలీ సమీపంలోని హిమానీనదం బ్రేక్ కావడంతో వరదలు వేగంగా వచ్చాయి. ఈ ఘటనలో సుమారు 200 మంది మిస్ అయ్యారు. తపోవన్ ఏరియాలో ఎన్‌టీపీసీ ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులూ ఈ ఘటనలో మరణించారు. కాగా, మే నెలలో పది రోజుల వ్యవధిలోనే తౌక్టే, యాస్ తుఫాన్లు రావడంతో.. దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి. తౌక్టే తుఫాన్ కారణంగా పశ్చిమ భారతంలో అధిక వర్షాపాతం కురవగా, యాస్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు కుండపోతు వర్షం పడింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. రాయలసీమ సహా పలు జిల్లాలో వరదలు పోటెత్తడంతో సుమారు 30 మంది మరణించారు.
Also Read: Cricket Round-up 2021: విరాట్ కోహ్లీకి ఏ మాత్రం కలిసిరాని 2021... ఈ ఏడాది అదొక్కటే...
ఫ్లైయింగ్ సిఖ్.. మిల్కా సింగ్ కన్నుమూత:
ఈ ఏడాది జూన్‌లో ఫ్లైయింగ్ సిఖ్.. మిల్కా సింగ్ ఛండీగడ్‌లో కన్నుమూశారు. 91ఏళ్ల మిల్కా సింగ్ కరోనా బారిన పడ్డాక సుమారు నెల రోజులకు మరణించాడు. ఆయన ప్రస్తుతం పాకిస్తాన్‌లోని గోబింద్‌పురాలో జన్మించారు. బ్రిటీష్ పాలనలో భారతానికి తొలి ఒలంపిక్ గోల్డ్ తెచ్చిన క్రీడాకారుడు మిల్కా సింగ్.
దానిష్ సిద్దిఖీ హత్య:
అవార్డ్ విన్నింగ్ ఫొటో జర్నలిస్టు దానిష్ సిద్దిఖీ అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు, అష్రఫ్ ఘనీ, అమెరికా ప్రభుత్వ సంకీర్ణ సేనల మధ్య ఘర్షణలను కవర్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పాకిస్తాన్ సమీపంలో ఓ సరిహద్దు దగ్గర ఆయన ఘర్షణలను రాయిటర్ సంస్థ కోసం కవర్ చేస్తుండగా ఓ దుర్ఘటనలో మరణించాడు.
కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన:
జూలైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన క్యాబినెట్‌ను ప్రక్షాళన గావించారు. 36 మంది ఎంపీలను మంత్రులుగా నియమించుకున్నారు. కాగా, 12 మంది సిట్టింగ్ కేంద్ర మంత్రులను మంత్రిమండలి నుంచి బయటకు పంపారు. దీంతో మోడీ క్యాబినెట్‌లో సభ్యుల సంఖ్య 78కి చేరింది.
Also Read: AP politics Roundup 2021: పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్.. ‘రిపబ్లిక్’తో మొదలు.. మాటల తూటాలు
నీరజ్ చోప్రా పసిడి:
ఆగస్టులో టోక్యోలో జరిగిన ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా దేశానికి గోల్డ్ మెడల్‌ను సాధించారు. 87.5 మీటర్ల దూరం దిగ్విజయంగా బల్లెన్ని విసిరి ఆయన పసిడిని పట్టేసుకున్నారు. ఇండివిడ్యువల్ ఒలంపిక్ గోల్డ్ గెలిచిన రెండో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో విభాగంలో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు.
టాటాల చేతికి ఎయిర్ ఇండియా:
టాటా సన్స్ ఎట్టకేలకు తాము స్థాపించిన విమాన సంస్థను తిరిగి సాధించుకున్నారు. ప్రభుత్వం నుంచి 100 శాతం ఎయిర్ ఇండియా స్టేక్‌ను సంపాదించుకుంది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థను అమ్మేయాలని దీర్ఘకాలంగా తంటాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఊరట దొరికింది. ప్రభుత్వ ప్రైవేటైజేషన్ ప్రక్రియలో ఇది తొలి సంస్థ. ఈ విమాన సంస్థను టాటాలు 1932లో టాటా ఎయిర్‌లైన్స్ పేరుతో స్థాపించారు. కానీ, 1953లో దీన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది. టాటా గ్రూప్ నుంచి విమాన సంస్థపై నియంత్రణను పొందింది.
పెగాసెస్‌తో ఉభయ సభల్లో నిరసనలు:
ఈ ఏడాది జులైలో జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు స్పైవేర్ పెగాసెస్ విషయమై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. జర్నలిస్టులు, పొలిటీషియన్లు, యాక్టివిస్టులు సహా పలువురిపై నిఘా వేసే చర్యలను ఓ మీడియా వెల్లడించింది. అందులో చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. ఈ స్పైవేర్‌ను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.
రైతులకు ప్రధాని మోడీ క్షమాపణలు:
సాగు చట్టాల రద్దు, కనీస మద్దతుకు చట్టబద్ధ హామీ, ఇతర డిమాండ్లతో ఢిల్లీ సరిహద్దులో ధర్నా చేసిన రైతులు ఎట్టకేలకు అనుకున్న డిమాండ్ సాధించారు. నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ జాతిన ఉద్దేశిస్తూ మాట్లాడుతూ రైతులకు క్షమాపణలు చెప్పారు.
Also Read: Round-up 2021: TRS vs BJP హీటెక్కిన రాజకీయాలు.. రూట్ మార్చిన కేసీఆర్.. బీజేపీకి దక్కింది ఆ ఒక్కటే..
నాగాలాండ్‌లో పౌరులపై కాల్పులు:
ఈ నెలలో నాగాలాండ్‌లో ఉగ్రవాదులుగా పొరబడి కోల్ మైనింగ్‌లో పని చేస్తున్న కార్మికులపై భద్రతా బలగాలు ఫైరింగ్ చేశాయి. మోన్ జిల్లాలోని తిరు, ఓటింగ్ గ్రామాల మధ్యలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు మరణించారు. ఈ ఘటన ఆందోళనలకు దారితీసింది. ఈ హింసాత్మక ఆందోళనల్లో మరో ఎనిమిది మంది పౌరులూ భద్రతా బలగాల కాల్పులకు మరణించినట్టు సమాచారం.
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం:
ఈ నెలలో తమిళనాడులోని కూనూరు సమీపంలో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ దుర్ఘటనలో సీనియర్ మోస్ట్ ఆఫీసర్, తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌తోపాటు మరో 12 మంది మరణించారు.
