Asianet News TeluguAsianet News Telugu

Round-up 2021: TRS vs BJP హీటెక్కిన రాజకీయాలు.. రూట్ మార్చిన కేసీఆర్.. బీజేపీకి దక్కింది ఆ ఒక్కటే..

తెలంగాణ రాజకీయాల్లో ఈ ఏడాది (Telangana Politics Roundup 2021) కీలక పరిణామాలే చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే.. చివరి నాటి కేంద్రంలోని బీజేపీపై KCR వైఖరిలో మార్పు కనిపిస్తోంది. కేంద్రంలోని మంత్రులపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బీజేపీ కూడా మునపటి కంటే జోరు పెంచింది. మరి ఏడాది కాలంలో తెలంగాణలో TRS vs BJP రాజకీయ పరిణామాలను ఒకసారి చూస్తే..

Round up 2021 TRS vs BJP Who will get edge in telangana
Author
Hyderabad, First Published Dec 16, 2021, 2:40 PM IST | Last Updated Dec 16, 2021, 2:57 PM IST

తెలంగాణ రాజకీయాల్లో ఈ ఏడాది (Telangana Politics Roundup 2021) కీలక పరిణామాలే చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగించగా.. huzurabadలో మాత్రం టీఆర్‌ఎస్‌కు బీజేపీ అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఇక, ధాన్యం కొనుగోళ్ల విషయానికి వస్తే టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. తప్పు మీదంటే.. కాదు మీదంటూ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే గతేడాది చివరిలో మూడు వ్యవసాయ చట్టాలకు కేసీఆర్ పరోక్ష మద్దతు ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత KCR ఈ రకమైన వైఖరి తీసుకోవడంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు ఢిల్లీలో దోస్తానా ఉందనే విమర్శలు వినిపించాయి. అయితే ఈ ఏడాది చివరికి వచ్చేనాటికి కేసీఆర్.. కేంద్ర పెద్దలతో ఢీ కొట్టేందుకు చూస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరణించిన రైతులకు తెలంగాణ తరఫున కేసీఆర్ పరిహారం ప్రకటించడం, ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో పోరాటం, ప్రెస్‌మీట్‌లో కేంద్ర పెద్దలపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. మరి తెలంగాణలో ఈ ఏడాది కాలంగా TRS vs BJP రాజకీయ పరిణామాలను ఒకసారి చూస్తే..

టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారిన రాజకీయం.. 
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. టీడీపీ, కాంగ్రెస్ కూటమిని ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది గులాబీ కండువా కప్పుకున్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు కారెక్కారు. అప్పటివరకు తెలంగాణలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని భావించిన కాంగ్రెస షాక్ తింది. అయితే ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానం మాత్రమే సాధించిన బీజేపీ.. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో జెండా ఎగరవేసి టీఆర్‌ఎస్‌కు బలమైన సంకేతాలు పంపింది.

ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో పరిస్థితులు టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారాయి. ఈ క్రమంలోనే తెలంగాణపై దృష్టి సారించిన బీజేపీ అధిష్టానం.. 2020 మార్చిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను నియమించింది. ఆ తర్వాత నుంచి బీజేపీ మరింత జోరుగా ప్రజల్లోకి వెళ్లింది. అధికార టీఆర్‌ఎస్‌పై దూకుడుగా విమర్శలు చేయడమే కాకుండా.. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుని పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. అంతేకాకుండా పార్టీ అధిష్టానం తెలంగాణ బీజేపీపై మరింత దృష్టి సారించేలా చేసింది.ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. 

అయితే 2021లో మాత్రం పరిస్థితుల్లో మార్పు కనిపించింది. ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్‌ఎస్ క్వీన్ స్లిప్ చేసింది. ఒక్క హుజురాబాద్‌లో మాత్రమే బీజేపీ విజయం సాదించింది. అయితే చాలా మంది దానిని ఈటల రాజేందర్ విజయంగానే చూడటం గమనార్హం. ధాన్యం కొనుగోళ్లతో పాటు పలు అంశాలపై ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్దం కాస్తా బూతుల స్థాయికి దిగజారిగింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌దే పైచేయి..
నల్గొండ - ఖమ్మం - వరంగల్, హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ గ్రాడ్యయేట్ ఎమెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. రెండు స్థానాలను టీఆర్‌ఎస్ తన ఖాతాలో వేసుకుంది. అయితే రెండు చోట్ల కూడా టీఆర్‌ఎస్‌కు విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీ విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థి రామచందర్‌ రావు చివరి వరకు గట్టి పోటే ఇచ్చారు. మరోవైపు నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి పెద్దగా పోటీనివ్వలేదు. ఇక్కడ తీన్మార్ మల్లన్న, కోదండరామ్‌లకు భారీగా ఓట్లు పోలయ్యాయి. 

సాగర్‌లో బీజేపీకి షాక్..
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలపుకుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 18,872 ఓట్ల‌ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జనారెడ్డి రెండో స్థానానికి పరిమితం కాగా, బీజేపీ అభ్య‌ర్థి ర‌వి నాయ‌క్ డిపాజిట్ గ‌ల్లంతు అయింది. ఇది బీజేపీ శ్రేణులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. 

గులాబీ టూ కమలం.. ఈటల మలుపు..
గులాబీ బాస్ కేసీఆర్ సన్నిహితునిగా పేరున్న ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్తానంలో ఈ ఏడాది కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచే టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి, Etela Rajenderకు మధ్య దూరం పెరుగుతున్నాయనే వార్తలు రాజకీయ వర్గాల నుంచి వినిపించాయి. ఈ క్రమలోనే ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయని.. వాటిపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారని సీఎంవో వర్గాలు వెల్లడించడం తెలంగాణ రాజకీయాలల్లో తీవ్ర కలకలం రేపింది. 

ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ తన పదవులకు రాజీనామా చేసి.. ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా.. అది అందరిని దృష్టిని ఆకర్షించింది. హుజురాబాద్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార టీఆర్‌ఎస్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది. దళిత బంధు పథకాన్ని తీసుకురావడమే కాకుండా, ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే అభివృద్ది కార్యక్రమాలను చకచకా చేపట్టింది. ప్రభుత్వ పథకాల పేరిట కొన్ని వేల కోట్లు హుజురాబాద్‌కు కేటాయించింది.

మరోవైపు ఈటల మాత్రం ఆత్మ గౌరవ నినాదంతో ముందకు సాగారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు, హుజురాబాద్ ఉప ఎన్నిక బీజేపీ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఇతర నాయకులు ఈటల విజయం కృషి చేశారు. ఉప ఎన్నిక పోలింగ్ రోజు కూడా బీజేపీ, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చివరికి ఈ ఎన్నికలో ఈటల విజయం సాధించారు. అయితే దీనిని చాలా మంది ఈటల విజయంగానే భావించండతో.. బీజేపీ ఘాటుగానే స్పందించింది. ఈటల గెలిచింది కమలం గుర్తుమీదనే అని చెప్పుకొచ్చింది. 

దళిత బంధు ఎప్పుడు అమలు చేస్తారన్న బీజేపీ..
హుజురాబాద్‌ ఉప ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం దళిత బంధు పథకం అమలను నిలిపివేయాలని చెప్పింది. ఈ క్రమంలోనే ఉప ఎన్నిక తర్వాత ఈ పథకాన్ని కొనసాగిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో.. ప్రభుత్వం నుంచి దళిత బంధుపై ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో ఈ పరిణామాలను క్యాష్ చేసుకోవడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. కేసీఆర్‌కు ఎన్నికలప్పుడు మాత్రమే పథకాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. Dalit Bandhu ఎప్పుడు అమలు చేస్తారని నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నారు.

ధాన్యం కొనుగోలు..
తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేసీఆర్ ప్రెస్‌ మీట్‌ (KCR Press Meet) పెట్టి మరి కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంజాబ్‌లో కొన్నట్టుగా తెలంగాణలో కేంద్రం ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. దీనిపై బీజేపీ నేతలు గట్టిగానే స్పందించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు ఉన్నాయని వాటి ప్రకారమే కొనుగోళ్లు జరుగుతాయని వారు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీలు రాష్ట్రంలో పోటాపోటీగా దీక్షలు చేపట్టారు. Bandi Sanjay ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లగా.. అక్కడ టీఆర్‌ఎస్ శ్రేణులు ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారు.

మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రం వైఖరి సరిగ్గా లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా ధర్నా చౌకలో నిరసకు కూర్చున్నారు. టీఆర్‌ఎస్ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రైతుల కోసం జాతీయ స్థాయిలో పోరుకు సిద్దమన్నారు. కేంద్రం విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్ల అంశంపై టీఆర్‌ఎస్ ఎంపీలో పార్లమెంట్‌లో నిరసన తెలిపారు. కేంద్రం వైఖరికి నిరనసగా పార్లమెంట్ శీతకాల సమావేశాలను బహిష్కరించారు. 


అన్ని ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌వే..
ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల కోటాలో జరిగిన 12 స్థానాలకు (MLC Election Results 2021) టీఆర్‌ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను ఏకగీవ్రంగా టీఆర్‌ఎస్ గెలుపొందింది. మరోవైపు స్థానిక సంస్థల కోటా పోటీకి బీజేపీ దూరంగా ఉంది. 

జాతీయ రాజకీయలపై కేసీఆర్..
కొంతకాలంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్.. రూట్ మార్చేందుకు యత్నిస్తున్నట్టుగా ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కేంద్రంలో రైతు వ్యతిరేక బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమని చెబుతున్నాయి. సరైన సమయంలో ఎవరికి బీజేపీ వ్యతిరేక పోరాటంపై కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కేసీఆర్‌తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కూడా జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ హడావుడి చేసిన.. ఆ తర్వాత సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజపీ నేతలు మాత్రం తెలంగాణ ఉద్యమ నేతలతో పాటు, బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. 

గత కొంతకాలంగా రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ కొనసాగిన.. ఢిల్లీ వెళ్లేసరికి కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయిమెంట్లకు ఈజీగా దొరికేవి. కేంద్రం తీసుకున్న మెజారిటీ నిర్ణయాలకు టీఆర్‌ఎస్ వ్యతిరేకించిన దాఖాలలు లేవు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి.ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్‌మెంట్ దొరకలేదనే ప్రచారం జరిగింది. మరి కొత్త ఏడాదిలో గులాబీ ఏ విధమైన వైఖరి తీసుకుంటాడు.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ ఎలాంటి పోరుబాట పడుతుందో వేచి చూడాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios