world cup 2023 : వరల్డ్ కప్ పాలిటిక్స్... టీమిండియా ఓటమికి ఇందిరా గాంధే కారణం : అసోం సీఎం నయా ట్విస్ట్
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజునే టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరగడం వల్లే ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడానికి కారణమని అసోం సీఎం హిమంతు బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసారు.
అసోం : ప్రపంచ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది... ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన భారత జట్టు ఫైనల్లో మాత్రం తడబడింది... ఇందుకు కారణాలు అనేకం. సెమీఫైనల్ వరకు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో రాణించిన భారత ఆటగాళ్లు ఫైనల్లో విఫలమడమే ఓటమికి ప్రధాన కారణం. కానీ తమ రాజకీయాల కోసం జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపిలు ఈ ప్రపంచ కప్ ఓటమి విచిత్ర విశ్లేషణలు చేస్తున్నారు. ఆటగాళ్ళ వైఫల్యమో, ప్రత్యర్థి మెరుగైన ఆటో కాదు రాజకీయాల వల్లే టీమిండియా ఓడిందంటూ కాంగ్రెస్, బిజెపిలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా బిజెపి ముఖ్యమంత్రి ఒకరు ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజునే టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరిగింది... అందువల్లే మనం ఓడిపోయామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. కాబట్టి దయచేసి గాంధీ కుటుంబసభ్యుల పుట్టినరోజుల్లో టీమిండియాతో మ్యాచులు ఆడించొద్దని బిసిసిఐ కోరుతున్నాను అంటూ కాంగ్రెస్ పార్టీపై అసోం సీఎం సెటైర్లు వేసారు.
స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ 2023 టోర్నీలో టీమిండియా అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరుకుందని హిమంతు బిశ్వ శర్మ తెలిపారు. భారత జట్టు, ఆటగాళ్ల ఫామ్ ను చూసి తప్పకుండా గెలుపు మనదేనని అభిమానులు భావించారని అన్నారు. కానీ మరో ప్రపంచ కప్ గెలిచే అద్భుత అవకాశాన్ని ఒక్క ఓటమితో భారత జట్టు కోల్పోయింది... ఇలా ఎందుకు జరిగిందోనని ఆరా తీసానన్నారు. అప్పుడు తెలిసింది ఆరోజు ఇందిరా గాంధీ పుట్టినరోజని... అందుకే టీమిండియా ఓడిందికదా.. అని బాధపడినట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
ప్రపంచ కప్ ఫైనల్ గుజరాత్ లో జరగడం... ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా లు ఈ మ్యాచ్ చూసేందుకు రావడమే టీమిండియా ఓటమికి కారణమని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ప్రధానిది ఐరన్ లెగ్ అని... ఆయన పేరుతో వున్న స్టేడియంలో మ్యాచ్ కు ఆయన రావడం వల్లే టీమిండియా ఓడిందంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు.
ఇక అహ్మదాబాద్ లో ఫైనల్ జరగడం కూడా భారత జట్టు ఓటమికి కారణమని... ముంబై వాంఖడే లాంటి స్టేడియంలో జరిగివుంటే ఫలితం మరోలా వుండేదని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇక 2011 లో కాంగ్రెస్ ప్రభుత్వం వుందికాబట్టే మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో భారత్ ప్రపంచకప్ సాధించిందని... ఇప్పుడు బిజెపి ప్రభుత్వం వుందికాబట్టే ఓటమిపాలయ్యింది అంటున్నారు. ఇలా కాంగ్రెస్ శ్రేణులు ప్రపంచకప్ ఓటమిపై బిజెపిని, ప్రధానిని టార్గెట్ చేయడంతో అసోం సీఎం కూడా కొత్త విశ్లేషణ తెరపైకి తెచ్చారు.