world cup 2023 : అలా చేసి ఉంటే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ గెలిచేది - అఖిలేష్ యాదవ్.. బీజేపీపై ఫైర్
icc cricket world cup 2023 : ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కాకుండా, యూపీలోని లక్నోలో జరిగి ఉంటే భారత్ గెలిచి ఉండేదని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. లక్నోలోని స్టేడియంలో జరిగితే టీమ్ ఇండియాకు విష్ణువు, అటల్ బిహారీ వాజ్ పేయ్ ఆశీస్సులు లభించి ఉండేవని తెలిపారు.
icc cricket world cup 2023 : క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా గెలిచింది. వరుసగా తొమ్మిది మ్యాచ్ లు గెలిచిన భారత్ ఫైనల్ లోనూ విజయం సాధిస్తుందని, ప్రపంచ కప్ మనకే దక్కుతుందని యావత్ దేశం భావించింది. కానీ మ్యాచ్ లో మన జట్టు పారజయం పాలైంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. ఈ విషయాన్ని క్రికెట్ అభిమానులు అంతగా జీర్ణించుకోలేకపోతున్నారు.
కాగా.. భారత్ ఓటమి పట్ల క్రికెట్ అభిమానులతో పాటు రాజకీయ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన భారత క్రికెట్ జట్టు ఓటమికి కారణం అధికార బీజేపీయే అని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇలాంటి కామెంట్లే చేయగా.. తాజాగా ఆయనకు సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జతకూడారు. పరోక్షంగా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ అహ్మదాబాద్ కు బదులు లక్నోలో జరిగి ఉంటే టీం ఇండియా తప్పకుండా గెలిచేదని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గుజరాత్ లో కాకుండా మ్యాచ్ లక్నోలో జరిగి ఉంటే టీమిండియాకు ఎంతో మంది ఆశీస్సులు లభించేవి. ఇక్కడ భారత జట్టుకు విష్ణువు, అటల్ బిహారీ వాజ్ పేయి ఆశీస్సులు లభించేవి. భారత్ గెలిచేది’’ అని అన్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి వల్ల ఆటగాళ్ల సన్నద్ధత అసంపూర్తిగా మిగిలిపోయిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
కాగా.. గతంలో యూపీలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ లక్నోలో ఉన్న క్రికెట్ స్టేడియానికి ‘ఎకానా స్టేడియం’గా నామకరణం చేసింది. ఎకానా అంటే విష్ణువు అనేక నామాల్లో ఒకటి. అయితే 2018లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ స్టేడియంకు మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత గౌరవార్థం ‘భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్ ఏకానా క్రికెట్ స్టేడియం’ పేరు మార్పు చేసింది.