సారాంశం
పొట్టి బట్టలు వేసుకోవడం.. రిసార్టుల్లో డ్యాన్సులు చేయడం అశ్లీలత కిందికి రాదని ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది.
ముంబై : మహిళల వస్త్రధారణపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. రోజురోజుకూ మహిళలపై పెరిగిపోతున్న హింసకు వారి దుస్తులనే కారణంగా చూపించేవారు ఎంతోమంది కనిపిస్తారు. వారి వస్త్రధారణ వల్లే వారి మీద అఘాయిత్యాలు జరుగుతాయి అంటూ కొంతమంది విరుచుకుపడడం విడ్డూరంగా కనిపిస్తుంది. ఇలాంటి వారికి బాంబే హైకోర్ట్ నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పు చెంపపెట్టులా మారింది.
పొట్టి బట్టలు వేసుకున్నంత మాత్రాన అశ్లీలతగా పరిగణించలేమని బెంచ్ ఓ కేసులో తీర్పు సందర్భంగా అభిప్రాయపడింది. రిసార్టుల్లో పొట్టి దుస్తులు వేసుకొని, రెచ్చగొట్టే విధంగా డాన్స్ లు చేయడాన్ని అశ్లీలతగా భావించలేమని హైకోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. నాగపూర్ లోని రెండు రిసార్ట్ లపై మే నెలలో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరుగురు మహిళలు పొట్టి స్కర్ట్ లు వేసుకుని డాన్సులు చేస్తుండడం కనిపించింది.
మాజీ సీఈసీ మనోహర్ సింగ్ గిల్ కన్నుమూత..
అక్కడ ఉన్న కొంతమంది ప్రేక్షకులు మద్యం తాగుతూ కనిపించారు. దాడులకు దిగిన పోలీసులు దీన్ని అశ్లీలతగా పరిగణించారు. వారి మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీని మీద కేసు హైకోర్టులోని నాగపూర్ బెంచ్ కు వెళ్లడంతో విచారణ జరిపిన ధర్మాసనం..పొట్టి బట్టలు వేసుకుని, రిసార్టులో డాన్సులు చేయడం అశ్లీలతగా పరిగణించలేమని తెలిపారు. పబ్లిక్ ప్లేస్ లలో ఇలాంటివి జరిగితే నేరంగా పరిగణించవచ్చని నాగపూర్ బెంచ్ తెలిపింది. రిసార్టులు, అందులో ఉన్న బంకెట్ హాల్ లు పబ్లిక్ ప్లేసులు కావని.. తెలిపింది.
వీటివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చుట్టుపక్కల ఉన్నవారు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయొచ్చని, అంతేకానీ ఎవరు ఫిర్యాదు చేయకుండా ప్రైవేట్ ఫంక్షన్ ల మీద పోలీసులు కేసులు పెట్టలేరని స్పష్టం చేస్తూ కేసులు కొట్టివేసింది.