ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్న ప్రధాని మోడీపై బీజేపీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. 2024లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ప్రధాని జోస్యం చెప్పారు.
యూపీ ఫలితాలు (up election results) 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఫిక్స్ చేశాయని ప్రధాని మోడీ (narendra modi) అన్నారు. ఇవే ఫలితాలు 2024లోనూ రిపీట్ అవుతాయని ప్రధాని జోస్యం చెప్పారు. ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని మోడీ కొనియాడారు. తొలిసారి ఓటేసిన యువకులు బీజేపీకి పట్టం కట్టారని.. గోవాలో అందరి అంచనాలు తలకిందులయ్యాయని మోడీ పేర్కొన్నారు. గోవా ప్రజలు బీజేపీకి (bjp) మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారని.. ఉత్తరాఖండ్‌లో ఫస్ట్ టైమ్ వరుసగా రెండోసారి పవర్‌లోకి వచ్చిందన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ పాలనతీరును మెచ్చి ప్రజలిచ్చిన తీర్పు అని మోడీ వ్యాఖ్యానించారు. పేదరికం నిర్మూలన అంటూ చాలా నినాదాలు, స్కీమ్‌లు వచ్చాయన్నారు. పేదరికం తొలగించేందుకు బీజేపీ చిత్తశుద్ధితో పనిచేసిందని నరేంద్రమోడీ గుర్తుచేశారు.
పేదలకు ప్రభుత్వ పథకాలు అందేవరకు తాను వదిలిపెట్టనని ప్రధాని తేల్చిచెప్పారు. చివరి పేదవాడి వరకు ప్రభుత్వ పథకాలు అందాలని.. నిజాయితీలో పనిచేస్తే ఎంత కష్టమైన పనైనా సాధ్యమవుతుందని మోడీ పేర్కొన్నారు. మహిళలు అధికంగా ఓట్లేసిన చోట బీజేపీ బంపర్ విక్టరీ కొట్టిందని ప్రధాని అన్నారు. తనకు స్త్రీ శక్తి అనే కవచం లభించిందని.. కులాల పేరుతో ఓట్లు అడిగి కొన్ని పార్టీలు యూపీ ప్రజల్ని అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని.. కులం, జాతి అనేది దేశ ప్రగతికి ఉపయోగపడాలి కానీ, విచ్ఛిన్నానికి కాదని ప్రధాని సూచించారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ (russia ukraine war) ప్రభావం ప్రపంచం మొత్తంపై వుందని.. మనదేశం శాంతివైపే వుంటుందన్నారు. అనేక రంగాల్లో ఉక్రెయిన్, రష్యాతో భారత్‌కు లావాదేవీలు వున్నాయని మోడీ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా అనేక వస్తువుల ధరలు పెరుగుతున్నాయని.. కరోనా, యుద్ధం ప్రభావాల్ని అధిగమించి భారత్ ఆత్మనిర్భర్‌గా నిలుస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. అవినీతి పరులను శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ, ఐటీ దాడులు చేస్తే, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈడీ, ఐటీ దాడులు జరిగితే కొందరు గ్రూపు రాజకీయాలు మొదలుపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కార్యకర్తల వల్లే బీజేపీ విజయం సాధ్యమైందన్నారు . 4 రాష్ట్రాల ప్రజలు మా పార్టీని ఆశీర్వదించారని చెప్పారు. ప్రధాని మోడీ సారథ్యంలో విజయాలు దక్కాయని.. మణిపూర్‌లో తొలిసారి బీజేపీకి అధికారం అప్పగించారని నడ్డా పేర్కొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌లలో వరుసగా 2వసారి అధికారం ఇచ్చారని ఆయన చెప్పారు. గోవాలో హ్యాట్రిక్ విజయాలు సాధించామని నడ్డా పేర్కొన్నారు.
