Asianet News TeluguAsianet News Telugu

నల్లగా ఉన్నావంటూ వేధించిన అత్తింటివారిని హతమార్చిన కోడలు

ఆహారంలో పాముల్ని చంపే విషం కలిపి....మృతుల్లో నలుగురు చిన్నారులు, ఓ వృద్దుడు

Woman taunted about colour poisoned guests

మహారాష్ట్రలో రాయ్ గడ్ ప్రాంతంలో ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. అత్తింటివారి వేధింపులు, హేళనలు తట్టుకోలేక తినే ఆహారంలో విషం కలిపి ఐదుగురి ని హతమార్చింది. అయితే  మృతుల్లో నలుగురు చిన్నారులు, ఓ వృద్దుడు ఉండటంతో విషాదం నెలకొంది.

ఈ దుర్ఘటనకు సబంధించిన వివరాలిలా ఉన్నాయి. జ్యోతి అనే యువతికి రెండేళ్ల క్రితం సురేష్ అనే యువకుడితో పెళ్లయింది. అయితే ఈమె శరీర ఛాయ కాస్త నలుపుగా ఉండటంతో అత్తింటివారు, బంధువులు హేళన చేసేవారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన యువతి వీరిపై ద్వేషం పెంచుకుంది. అత్తింటివారిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని అవకాశం కోసం ఎదురుచూసింది.

అయితే జ్యోతి భర్త తరపు బంధువు మహాడ్ గ్రామానికి చెందిన సుభాష్ ఇంట్లో ఓ శుభకార్యానికి అత్తింటివారితో కలిసి జ్యోతి హాజరయ్యింది.  ఇదే వేడుకలో అత్తింటివారితో పాటు తనను హేళన చేసిన బంధువులపై పగ తీర్చుకోవాలనుకుంది. ఇందులో భాగంగా జ్యోతి విందు కోసం వండిన వంటల్లో పాములను చంపడానికి ఉపయోగించే విషం కలిపింది. ఈ విషాహారాన్ని దాదాపు 200 మంది తిన్నారు. వీరిలో పరిస్థితి విషమించి ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో 10 ఏళ్ల లోపు చిన్నారులు నలుగురు, ఓ వృద్దుడు ఉన్నారు.

ఈ దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులు ఈ దారుణానికి పాల్పడింది జ్యోతేనని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అహార పధార్థాలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios