విమానంలో కీచకుడు.. తోటి ప్రయాణికురాలికి లైంగిక వేధింపులు.. ఆ మహిళ చేసిన పనితో...
విమానాల్లోనూ మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. తోటి ప్రయాణికులు లైట్లు ఆర్పాక చేసే వికృత చేష్టలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనే ముంబై-గౌహతి ఇండిగో విమానంలో చోటు చేసుకుంది.

ముంబై : కన్నూమిన్నూ కానని కామం.. ఏమవుతుందిలే అనే పొగరు.. బస్సు, రైలు, విమానం వాహనం ఏదైనా.. నేలమీదా, నింగిలోనా అనే తేడా లేకుండా మహిళ కనిపిస్తే చాలు కామంతో రెచ్చిపోతున్నారు కామాంధులు. తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ..తమ కీచక బుద్దిని బయటపెట్టుకుంటున్నారు. వారిని మానసికంగా హింసకు గురిచేస్తున్నారు. అలాంటి ఓ ఘటనలో ఆ కీచకుడికి భలే బుద్దిచెప్పిందో మహిళ. ఈ ఘటన ఇండిగో విమానంలో వెలుగు చూసింది.
ముంబై నుంచి గౌహతికి వెడుతున్న ఓ ఇండిగో విమానంలో అభ్యంతరకర ఘటన వెలుగు చూసింది. ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురయ్యింది. విమానంలో ఆమెపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇండిగో విమానంలో తోటి ప్యాసింజర్ పై అత్యంత అసహ్యంగా ప్రవర్తించాడో ప్రబుద్ధుడు. అయితే విమానయాన సంస్థ విమానాల్లో ప్రయాణించే మహిళలకు ఇలాంటి అనుభవాలు ఎదురవడం గత మూడు నెలల్లో ఇది ఐదోసారి కావడం గమనార్హం.
'రక్షకులే నేరస్థులుగా మారితే ఎలా...?' : గుజరాత్ హైకోర్టు ఆగ్రహం
విమానం టేకాఫ్ అయి క్యాబిన్ లైట్లు ఆర్పింది మొదలు ఈ ప్రయాణంలో ఆ మహిళ పక్క సీట్లో ఉన్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎంతవరకు దిగజారాడంటే.. రెండు సీట్ల మధ్య ఉన్న రెస్ట్ హ్యాండిల్ ను పైకి తోసేసాడు. ఆ తర్వాత మహిళను అభ్యంతరకరంగా తాకాడు. విషయం అర్థమైన మహిళ రెస్ట్ హ్యాండిల్ ను కిందికి దింపింది.
అయినా సదరు కామాంధుడు తీరు మారలేదు. మామూలుగా చెబితే బుద్ధి వచ్చేలా లేదనుకున్న ఆ మహిళ మరి కాసేపు అతడు చేష్టల్ని పరీక్షించాలనుకుంది. మరోసారి ఆర్మ్ రెస్ట్ ను కిందికి దించింది. నిద్రపోతున్నట్టు నటించింది. అతగాడి సంగతేమిటో చూద్దామని కళ్ళు మూసుకుని.. అతడి మీద ఓ కన్నేసి ఉంచింది.
గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న ఎమ్మెల్సీ కవిత..
మహిళ నిద్ర పోయింది కాబట్టి ఇక తన పని యదేచ్ఛగా చేయొచ్చు అనుకున్నాడు కీచక ప్రయాణికుడు. వంకర బుద్దితో మరోసారి తన చేతికి పని చెప్పాడు. అదే అదను కోసం ఎదురుచూస్తున్న మహిళకు అడ్డంగా పట్టుబడిపోయాడు. దీంతో అప్పటివరకు తానేదైనా పొరపాటు పడుతున్నానా అని చిన్న అనుమానం ఉన్న మహిళకు కావాలనే చేస్తున్నాడని అర్థం అయ్యింది.
అంతే, వెంటనే క్యాబిన్ లైట్లు ఆన్ చేసి గట్టిగా కేకలు వేసింది. క్యాబిన్ క్రూ కు అతని మీద ఫిర్యాదు చేసింది. అప్పటివరకు తానేం చేసినా అడ్డు చెప్పకపోవడంతో.. రెచ్చిపోయి మరింతగా విసిగించడం మొదలుపెట్టిన అతడికి ఒక్కసారిగా దిమ్మ తిరిగింది. ఆ మహిళ కాళ్ళా వేళ్ళా పడి క్షమాపణ చెప్పడం ప్రారంభించాడు. కానీ బాధిత మహిళ ఒప్పుకోలేదు.
తనతో అంత అసభ్యకరంగా ప్రవర్తించిన మనిషిని క్షమించదలచుకోలేదు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆ మహిళా ప్రయాణికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని.. ఈ కేసు దర్యాప్తులో తమ సహాయపడతామని ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది.