గుజరాత్‌లో ఓ మహిళ తన కుక్క పిల్లకు సోనూ అనే పేరు పెట్టినందుకు పొరుగునే నివసిస్తున్న ఓ వ్యక్తి ఆమెకు నిప్పు పెట్టాడు. సోనూ అనే పేరు ఆ నిందితుడి భార్య ముద్దు పేరు కూడా. కుక్క పిల్లకు ఆ పేరు పెట్టవద్దని వారించినా ఆమె వినలేదని నిందితుడు తెలిపాడు. దీంతో ఇంట్లో ఎవరులేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మొత్తం ఆరుగురిపై కేసు ఫైల్ అయింది.
అహ్మదాబాద్: పెట్ డాగ్స్(Pet Dogs) చాలా కుటుంబాల్లో కలిసిపోయి ఉంటుంటాయి. పెట్ యానిమల్స్‌ను ఇంటి సభ్యుడిలా చూస్తారు చాలా మంది. వాటిని ముస్తాబు చేయడం.. ఆరోగ్యంగా చూసుకోవడం మొదలు.. వాటికి ప్రత్యేకంగా ఓ ముద్దు పేరు పెడుతుంటారు. ఈ కుక్క పిల్లలు, పిల్లి పిల్లలకూ వ్యక్తులకు పెట్టే ముద్దు పేర్లనూ పెడుతుంటారు. ఇది సాధారణ విషయమే. గుజరాత్(Gujarat) లోనూ ఓ మహిళ తన కుక్క పిల్లకు సోనూ(Sonu) అనే పేరు పెట్టింది. కానీ, ఆ పేరు పొరుగు ఇంటి వారి ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఏకంగా ఆ మహిళకే నిప్పు పెట్టి చంపబోయారు.
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో నీతాబెన్ సర్వాయ నివసిస్తున్నారు. ఆమె తన పెంపుడు కుక్కకు సోనూ అనే పేరు పెట్టింది. అయితే, ఆమె పొరుగు ఇంటావిడ ముద్దు పేరు కూడా సోనూనే. దీంతో పొరుగు ఇంటి వారికి ఈమె పెంపుడు కుక్క పేరుతో చిరాకు వచ్చింది. కుక్క పేరు సోనూ అని పెట్టకూడదని పొరుగు వారు వారించినట్టు తెలిసింది. కానీ, అదేమీ సర్వాయను ఆపలేకపోయాయి. దీంతో పొరుగింటావిడ భర్త సురభాయి భర్వాడ్ ఆమెపై దాడి చేయడానికే సిద్ధమయ్యాడు.
Also Read: పాములను వెళ్లగొట్టాలని ఇంటినే తగులబెట్టాడు.. మండుతున్న ఇంటి ఫొటోలు వైరల్
సోమవారం మధ్యాహ్నం నీతాబెన్ భర్త, ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లారు. అదే సమయంలో సురభాయి భర్వాడ్, మరో ఐదుగురిని వెంటబెట్టుకుని నీతాబెన్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. భర్వాడ్ సహా ఇతరులు తనను దూషించారని నీతాబెన్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా, వారిని పట్టించుకోవద్దనే ఉద్దేశంతో ఆమె కిచెన్ వైపు వెళ్లిందని తెలిపారు. కానీ, వారు అక్కడితో ఆగలేదని, ఏకంగా ఇంట్లోకి వచ్చారని వివరించారు. తన వెంటే కిచెన్‌లోకీ ముగ్గురు వ్యక్తులు వచ్చారని తెలిపారు. అందులో ఒకరు కంటైనర్ నుంచి కిరోసిన్ తనపై పోశారని, అగ్గిపెట్టెతో నిప్పు కూడా అంటించారని ఆరోపించారు.
నిప్పు పెట్టగానే నీతాబెన్ కేకలు పెట్టారు. ఇరుగు పొరుగు వారు వెంటనే వారి ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఆమె భర్త కూడా ఇల్లు చేరవచ్చాడు. ఆమె భర్త కోట్ ఉపయోగించి ఆమె మంటలను దాదాపు ఆర్పేయగలిగారు. వెంటనే భావ్‌నగర్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌కు ఆమెను తరలించారు. ప్రస్తుతం ఆమె ఆ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
Also Read: ఇండియన్ ఆయిల్ డిపోలో మంటలు.. ముగ్గురు దుర్మరణం
నీతాబెన్ ఉద్దేశపూర్వకంగానే తన భార్య ముద్దు పేరును ఆమె కుక్కపిల్లకు పెట్టిందని భర్వాడ్ ఆరోపించారు. సోనూ పేరు పెట్టవద్దని సూచించినా ఆమె పట్టించుకోలేదని పోలీసులకు తెలిపారు. అయితే, ఆ రెండు కుటుంబాలకు గతంలోనూ వైరం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నీటి సరఫరా విషయమై ఈ రెండు కుటుంబాల మధ్య ఇది వరకే ఓ సారి గొడవ జరిగిందని వివరించారు. అయితే, చర్చించి ఆ సమస్యను పరిష్కరించుకున్నారని చెప్పారు.
హత్యాయత్నం, ట్రెస్‌పాసింగ్, అవమానించడం, ఇతర అభియోగాల కింద సంబంధిత సెక్షన్‌ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఆరుగురి పేర్లను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.
