Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ ఆయిల్ డిపోలో మంటలు.. ముగ్గురు దుర్మరణం

పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన  ఓ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. అనూహ్య వేగంతో మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని కీలల కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో సుమారు 50 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. 

three killed in fire accident in IOCL in west bengal
Author
Kolkata, First Published Dec 21, 2021, 10:58 PM IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌(IOCL)కు చెందిన నాఫ్తా హైడ్రోజన్ మిక్సింగ్ ప్లాంట్‌లో భారీగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ మంటల కారణంగా ముగ్గురు మరణించారు. మరో 50 మంది దాకా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా(Haldia)లోని ప్లాంట్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. చాలా గంటలపాటు ప్రయత్నించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.

మోటార్ స్పిరిట్ ఉత్పత్తి చేసే డీహెచ్‌డీ బ్లాక్‌లో ఈ దుర్ఘటన మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు సమాచారం. ఐవోసీలో షట్‌డౌన్ ప్రొసీజర్‌పై మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు కొన్ని వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఘటనపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. హల్దియాలోని రిఫైనరీలో ప్రధానమైన యూనిట్లలో షట్‌డౌన్, మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని ఆ సంస్థ తెలిపింది. ఎంఎస్‌క్యూ యూనిట్‌లో షట్‌డౌన్ సంబంధిత పనులు జరుగుతుండగా దుర్ఘటన జరిగిందని పేర్కొంది. ఆకస్మికంగా, అనూహ్య రీతిలో మంటలు వ్యాపించినట్టు ఆ సంస్థ వివరించింది. ఈ మంటలకు 44 మందికి గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురు ఆ గాయాలతో ప్రాణాలు వదిలారని తెలిపింది.

Also Read: Japan Fire accident: భారీ అగ్నిప్రమాదం.. 27 మంది మృతి

ఫస్ట్ ఎయిర్ సెంటర్‌లో వారికి ప్రాథమిక చికిత్స అందించామని, ఆ తర్వాత హల్దియా రిఫైనరీ హాస్పిటల్‌లో చికిత్స కోసం పంపించామని ఆ సంస్థ పేర్కొంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం తరలించడానికి జిల్లా యంత్రాంగం నుంచి సహకారాన్ని కోరినట్టు వివరించింది. వెంటనే క్షతగాత్రులకు చికిత్స అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపింది. అయితే, ఈ దుర్ఘటన చోటుచేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయమై అధికారులు పరిశీలనలు చేస్తున్నారు.

బెంగాల్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. హల్దియాలోని ఐవోసీలో చోటుచేసుకన్న ఘటన దిగ్భ్రాంతికరం అని ట్వీట్ చేశారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశామని, ఆ పద్ధతిలో క్షతగాత్రులను కోల్‌కతాకు వేగంగా తరలిస్తున్నట్టు వివరించారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని విధా ల సహకారం అందిస్తుందని తెలిపారు.

ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని ఐవోసీఎల్ హాస్పిటల్, కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేర్చారు.

Also Read: నల్గొండ: భారీగా అగ్నిప్రమాదం... ఎగసిపడుతున్న మంటలు

ఈ ఘటనలో గాయపడిన వారందరికీ మంచి చికిత్స అందిస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పరిహారం కూడా ఇస్తామని వివరించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను కనుగొనడానికి దర్యాప్తును ఆదేశించినట్టు తెలిపారు.

ఈ నెలలోనే జపాన్ లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 27 మంది చ‌నిపోగా, ప‌లువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ఒసాకా నగరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారని అధికారులు వెల్ల‌డించారు.  జపనీస్ బ్రాడ్‌కాస్టర్ నిప్పన్ హోసో క్యోకై (NHK) మార్కెట్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలోని నాలుగో  అంతస్తులో శుక్రవారం  మంటలు చెలరేగాయని వెల్లడించింది. ఈ ఘటనలో 28 మంది చిక్కుకున్నారనీ, వారిలో 27 మంది గుండె ఆగిపోవడంతో మరణించారని స‌మాచారం అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios