మేజర్లు ఒకరని మరొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుంటే.. వారిని అడ్డుకునే హక్కు, శిక్షించే అధికారం ఎవరికీ లేదు.. అని ఓ వైపు న్యాయస్థానాలు తీర్పులు వెలువరిస్తున్నప్పటికీ.. ప్రేమికులకు శిక్షలు తప్పడం లేదు. పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కారణంతో ఓ జంటకు గ్రామస్థులు పెద్ద శిక్షవేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ పరిధిలోని చీర్వాకు చెందిన సెర్ గ్రామంలో ఒక ప్రేమ జంటను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. అక్కడ గుమిగూడిన జనమంతా దీనిని వినోదంగా చూశారేతప్ప ప్రేమ జంటకు సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. పైగా దీనిని వీడియో తీశారు.

అంత పెద్ద శిక్ష వేయడానికి కారణం ఏంటో తెలుసా.. గ్రామానికి చెందిన ఒక యువకుడు సమీపంలోని మరో గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. తరువాత ఆ యువతిని అతను గ్రామానికి తీసుకువచ్చాడు. ఇది గ్రామంలోనివారికి ఎంతమాత్రం నచ్చలేదు. 

దీంతో ప్రేమ జంటకు శిక్ష విధించాలని భావించిన గ్రామీణులు ఆ ప్రేమ జంట ధరించిన దుస్తులను తొలగించి తాడుతో కట్టేశారు. తరువాత వారిని నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. సమాచారం అందుకున్న సుఖేర్ పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామీణుల బారి నుంచి ఆ ప్రేమజంటను విడిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.