సారాంశం
ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ ఓ మహిళ రూ. 8.30 లక్షలు పోగొట్టుకుంది. ఆ మహిళ ఖాతా నుంచి ఓ సైబర్ కేటుగాడు డబ్బులు గుంజాడు.
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, ఆన్‌లైన్ షాపింగ్‌లు పెరిగినట్టే ఆన్‌లైన్ మోసాలూ అధికమవుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ, ఆధునిక విషయాలపై అవగాహన లేని వృద్ధులు ఈ మోసాలకు ఎక్కువగా బలి అవుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఇటీవల చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తూ రూ. 8.30 లక్షలు పోగొట్టుకుంది.
మహారాష్ట్రలో మీరా రోడ్డులో నివసించే 70 ఏళ్ల మహిళ ఆన్‌లైన్‌లో టవల్స్ కొనుగోలు చేయాలని భావించింది. అందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో నెట్ ఆన్ చేసి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసింది. ఆన్‌లైన్‌లో ఆరు టవల్స్‌కు ఆర్డర్ పెట్టింది. అందుకు రూ. 1,160 చెల్లించడానికి ప్రయత్నించింది.
ట్రాన్సాక్షన్ ఇనీషియేట్ చేసింది. కానీ, ఆమె అకౌంట్ నుంచి రూ. 19,005లు డెబిట్ అయ్యాయి. దీంతో ఆమె బ్యాంక్‌ను కాంటాక్ట్ కావడానికి ప్రయత్నించింది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వెతికి బ్యాంక్ హాట్‌లైన్‌కు కనెక్ట్ కావడానికి ప్రయత్నాలు చేసింది. కానీ, అది సాధ్యం కాలేదు.
ఆ తర్వాత బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆమెకు సహాయం చేయడానికే కాల్ చేసినట్టు కాలర్ వివరించాడు. ఆ వ్యక్తి డబ్బులు రిఫండ్ కావడానికి ఓ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరాడు. ఆ వృద్ధురాలు ఆ కాలర్ చెప్పినట్టు నడుచుకుంది.
కానీ, ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాక ఆమె ఖాతా నుంచి మరో రూ. 1 లక్ష డబ్బులు కట్ అయ్యాయి. దీంతో ఆ మహిళ ఆందోళన చెందింది. తన ఖాతా నుంచి గుర్తు తెలియని విధంగా డబ్బులు విత్‌డ్రా అవుతున్నాయని గమించింది. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. కానీ, అప్పటికే రూ. 8.3 లక్షల డబ్బులు ఖాతా నుంచి మాయం అయ్యాయి.
ఆ డబ్బులు యూపీకి చెందిన వ్యక్తి ఖాతాలోకి వెళ్లాయని పోలీసులు తెలిపారు. ఆ గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎంబీవీవీ పోలీసు సైబర్ సెల్ వివరించారు.