Husband for rent: భర్త మోసం చేశాడని తెలుసుకున్న భార్య… ఆ భర్తను వదిలేయలేదు. ఆ భర్తతోనే తెలివైన వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. అతని ప్రియురాలికే భర్తను అద్దెకిస్తానని చెప్పింది. నెలకు 85 వేల రూపాయలు చెల్లించాలని కోరింది. దీనికి ప్రియురాలు ఓకే చెప్పింది కానీ భర్త మాత్రం ఒప్పుకోలేదు. 

భర్తకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిస్తేనే భార్య భగ్గుమంటుంది. ఇద్దరి వ్యవహారం రోడ్డు మీదకు లాక్కొచ్చేస్తుంది. కోర్టు మెట్లెక్కి భర్త పరువు తీస్తుంది. చివరికి విడాకులు ఇస్తుంది. కానీ నేటి తరం భార్య మాత్రం అలాంటివేమీ చేయలేదు. భర్త చేసిన తప్పును తనకు ప్రాఫిట్ మార్చుకోవాలనుకుంంది. విడాకులు ఇచ్చి లాభం లేదనుకుని తన భర్తను అతని ప్రియురాలికే అద్దెకు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. అయితే దీనికి నెలకు అక్షరాలా 85,000 రూపాయలు చెల్లించాలని కండిషన్ పెట్టింది. దానికి ప్రియురాలు కూడా ఒప్పుకుంది. కానీ ఈ డీల్‌కు భర్త మాత్రం ఒప్పుకోలేదు.

పోలీస్ అయి ఉండి..

ఈ విచిత్రమైన ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. 31 ఏళ్ల ఖున్ క్వాంగ్ అనే మహిళకు పదేళ్ల క్రితం పెళ్లయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు 8 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఖున్ క్వాంగ్ భర్త (35) ఒక పోలీస్ ఆఫీసర్. అయితే, గత ఏడాది నుంచి అతను సోషల్ మీడియాలో పరిచయమైన మరో అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడు. భర్తపై అనుమానం వచ్చింది భార్యకు. 

డిటెక్టివ్‌తో గుట్టురట్టు

భర్త ప్రవర్తనపై మారిపోవడం.. అతను తరచుగా ఇంటికి రాకపోవడం వంటివి ఆమెలో అనుమానాన్ని మరింత పెంచేశాయి. కానీ, చేతిలో ఎలాంటి ఆధారం లేదు. దీంతో, రోజుకు 25,000 రూపాయలు చెల్లించి ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించుకుంది. ఆ డిటెక్టివ్ ఒక్క రోజులోనే ఆమె భర్త ప్రియురాలి ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలు సంపాదించాడు. దీంతో, ఖున్ క్వాంగ్ నేరుగా భర్తను నిలదీసింది. కూతురు ఉన్నా ఇలా ఎందుకు చేశావని అడిగింది. మాటామాటా పెరగడంతో, అతను తాను ప్రియురాలితోనే ఉంటానని తేల్చి చెప్పేశాడు. దీంతో ఖున్ క్వాంగ్ మౌనంగా ఉండిపోయింది.

భర్తను అద్దెకిస్తానని డీల్

భార్యా, పిల్లలు ఉన్నా సిగ్గులేకుండా ప్రవర్తించిన భర్తను ఎందుకు అంత సులువుగా వదిలేయాలనుకుంది భార్య. భర్తతో మాట్లాడి లాభం లేదని గ్రహించిన ఖున్ క్వాంగ్, నేరుగా అతని ప్రియురాలితోనే మాట్లాడింది. "నేను మీపై కేసు పెడితే నువ్వు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అలా కాకుండా నా భర్తను నీకే అద్దెకు ఇస్తాను. నెలకు 85,000 రూపాయలు నాకు చెల్లించాలి" అని చెప్పింది. డబ్బున్న ప్రియురాలు వెంటనే ఒప్పుకుంది. అయితే ఈ డీల్ గురించి తెలిసి భర్త మాత్రం పెద్ద గొడవ చేశాడు. ఈ ఒప్పందం వద్దని తనకు విడాకులు కావాలని పట్టుబట్టాడు.

ఈ వింత ఘటన థాయ్‌లాండ్‌లోని ప్రముఖ టీవీ షో 'హోనే క్రసై'లో ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ లాయర్ మాట్లాడుతూ.. థాయ్‌లాండ్ చట్టాల ప్రకారం ఇలా భర్తను అద్దెకు ఇవ్వడం చెల్లదని, దీనివల్ల కోర్టులో ఖున్ క్వాంగ్‌కే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.