నమ్మిన వ్యక్తి వంఛించాడు. 14 సార్లు బలవంతంగా అబార్షన్లు చేయించాడు. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. దీంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది.
ఢిల్లీ : ఓ మహిళ.. ఓ వ్యక్తిని నమ్మింది. పెళ్లి చేసుకుంటానన్న అతడి మాటలు నమ్మి సహజీవనం చేసింది. కానీ.. ఆ వ్యక్తి ఎనిమిదేళ్లలో పద్నాలుగు సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడు. దీంతోపాటు పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనోవేదనకు గురైన ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటున్న 33 యేళ్ల బాదితురాలితో బీహార్కు చెందిన గౌతమ్ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎనిమిదేళ్లలో ఆమెకు పద్నాలుగు సార్లు అబార్షన్ చేయించాడు. చివరకు పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. దీంతో ఆమె జూలై 5న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె దుస్తుల్లో సూసైడ్ నోట్ లభించింది. ‘అతడు చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాలు సేకరించాను. నా సెల్ ఫోన్ లో చెక్ చేయండి’ అని ఆ నోట్ లో మహిళ రాసిపెట్టింది.
ఇదిలా ఉండగా, జూలై 1న తమిళనాడులో అవాంఛనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల మైనర్ బాలిక గర్భం దాల్చింది. దీంతో దానికి కారణం అయిన ఆమె బాయ్‌ఫ్రెండ్ అబార్షన్ కోసం ఆమెకు ఏవో పిల్ ఇచ్చాడు. ఆ మైనర్ బాలిక ఆ టాబ్లెట్ వేసుకోగానే... స్పృహ కోల్పోయింది. కళ్లు తిరిగి కింద పడిపోయింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆ బాలిక మరణించిందని వైద్యులు ధృవీకరించారు.
తమిళనాడులోని తిరువన్నమలైలోని చెంగాం ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. చెంగాంకు చెందిన పదిహేనేళ్ల బాలికను 27 యేళ్ల ఎస్ మురుగన్ అనే వ్యక్తి రోజూ స్కూల్‌కు తీసుకు వెళ్తుండేవాడు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య సంబంధం పెరిగింది. అది శారీరక సంబంధంగా మారింది. దీంతో ఆ మైనర్ బాలిక గర్భవతి అయ్యింది. దీంతో ఇద్దరూ కంగారు పడ్డారు. ఇప్పటివరకు గుట్టుగా సాగుతున్న వ్యవహారాన్ని.. దీనివల్ల బట్టబయలు చేయడం ఇష్టం లేక.. అలాగే రహస్యంగా ఉంచాలనుకున్నాడు సదరు మురుగన్. దీనికోసమే ఎవరికీ తెలియకుండానే గప్ చిప్ గా అబార్షన్ చేయిద్దామని ప్రయత్నాలు చేశారు.
అక్రమంగా అబార్షన్లు చేసి.. పిండాలను బాక్సులో పెట్టి పడేశారు.. విచారణకు ఆదేశాలు...
ఇది తనొక్కడి వల్ల కాదని మురుగన్ 27 ఏళ్ల ప్రభు అనే తన స్నేహితుడిని సలహా అడిగాడు. ఫ్రెండ్ ప్రభు గర్భస్రావం కోసం ఓ పిల్‌ను ఎస్ మురుగన్‌కు ఇచ్చాడు. ప్రతీరోజు లాగే ఆ రోజు కూడా మురుగన్ ఆ 15 ఏళ్ల మైనర్ బాలికను స్కూల్ కి తీసుకువెళ్లడానికి ఇంటికి వెళ్లి తీసుకెళ్లాడు. స్కూల్‌కు తీసుకు వెడుతూ.. దారిలోనే ఆమెకు ఆ అబార్షన్ పిల్ ఇచ్చి వేసుకోమన్నాడు. ఆమె అక్కడే దాన్ని వేసుకున్నది. ఆ అబార్షన్ పిల్ వేసుకున్న తరువాత ఇద్దరూ కలిసి స్కూల్ వైపు వెళ్లుతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఆ బాలిక స్పృహ కోల్పోయింది. కింద పడిపోయింది. దీంతో కంగారు పడ్డ మురుగన్ ఆ బాలికను వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించాడు. కానీ అప్పటికే ఆ బాలిక మరణించింది. మురుగన్, అతని స్నేహితుడు ప్రభును పోలీసులు అరెస్ట్ చేశారు.
