Asianet News TeluguAsianet News Telugu

వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు.. ఆ మహిళకు రూ. 8 లక్షల ఫైన్..!

వీధి కుక్కలకు ఫుడ్ పెట్టినందుకు ముంబయిలోని ఓ మహిళకు రూ. 8 లక్షల ఫైన్ విధించారు. నవి ముంబయిలోని ఎన్ఆర్ఐ హౌజింగ్ సొసైటీ ప్రాంగణంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టినందుకు వారికి ఫైన్ విధించారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టిన ప్రతి సారీ రూ. 5 వేల జరిమానా విధించారు. ఇప్పుడు ఆమె పేరిట మొత్తంగా రూ. 8 లక్షల జరిమానా ఉన్నది. మరో నివాసి పైనా రూ. 6 లక్షల ఫైన్ ఉన్నది.
 

woman fined of rs 8 lakh for feeding dogs
Author
Mumbai, First Published Dec 17, 2021, 6:30 PM IST

ముంబయి: నోరు లేని మూగ జీవాలు ఆకలి దప్పికలను బయటకు మాటల రూపంలో చెప్పలేవు. వాటిని కనిపెట్టుకుని ఆహారం, నీరు అందించడమంటే గొప్ప విషయమే. జంతువుల కోసమే ప్రత్యేకంగా పని చేసే కార్యకర్తలూ ఉన్నారు. సంస్థలూ ఉన్నాయి. జంతువులకు నీరు పెట్టినా.. ఆహారం పెట్టినా చాలా మంది హర్షిస్తారనడంలో సందేహం లేదు. కానీ, Mumbaiలోని ఓ మహిళకు మాత్రం ఇందుకు భిన్నమైన అనుభవం ఎదురైంది. భిన్నం అని కాదు.. షాక్ తినే పరిణామం ఎదురైంది. వీధి కుక్క(Stray Dogs)లకు ఆహారం పెడుతున్నదని ఏకంగా రూ. 8 లక్షల జరిమానా(Fine) పడింది.

ఆమె నవీ ముంబయిలోని ఎన్‌ఆర్ఐ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు. ఆ కాంప్లెక్స్‌లో అప్పుడప్పుడు వీధి కుక్కలు కనిపించేవి. అవి ఆకలితో తచ్చాడుతున్నట్టుగా ఆమెకు కనిపించేవి. అందుకే వీలు చిక్కినప్పుడల్లా వాటికి ఆమె ఆహారం పెడుతూ వస్తున్నది. అయితే, ఈ విషయం మాత్రం ఆ కాంప్లెక్స్ వాసులకు గిట్టలేదు. అందుకే ఆ రెసిడెన్షియల్ సొసైటీ ఆమెపై ఫైన్ విధించడానికి సిద్ధమైంది. ఆ ఎన్‌ఆర్ఐ కాంప్లెక్స్ మేనేజ్‌మెంట్ కమిటీ ఆమెకు ఫైన్ వేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆమె ఎప్పుడు ఆ కాంప్లెక్స్ ప్రాంగణంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టినా పని గట్టుకుని చూస్తూ నోట్ చేసుకోవాలని వాచ్‌మెన్‌కు ఆ కమిటీ పురమాయించింది. ఆమె ఎప్పుడు వీధి కుక్కలకు ఆహారం పెట్టినా ఆ వాచ్‌మెన్ నోట్ చేసుకునే వాడు. కమిటీ నిర్ణయం మేరకు ఆమె వీధి కుక్కలకు ఆహారం పెట్టిన ప్రతి సారీ ఆమెకు రూ. 5 వేల చొప్పున జరిమానా విధించారు. వీటిని లిట్టరింగ్ చార్జీగా ఆమె నుంచి వసూలు చేశారు. ఇప్పుడు ఆమె పేరు మీద మొత్తం ఫైన్ రూ. 8 లక్షలకు చేరిందని అన్షు సింగ్ వివరించారు.

Also Read: వీధి కుక్క.. పులి వేషం వేస్తే..

ఈ నిబంధనలు జులై నుంచి అమలు చేస్తున్నారని తెలిపారు. అదే కాంప్లెక్స్‌లోని మరో నివాసి లీల వర్మపైనా రూ. 6 లక్షల జరిమానా ఉన్నదని తెలిపారు. అయితే, హౌజింగ్ కాంప్లెక్స్ సెక్రెటరీ వినీత శ్రీనందన్ స్పందించారు. ఆ కాంప్లెక్స్‌లోని పిల్లలు సాయంత్రం పూట ట్యూషన్ కోసం బయటకు వెళ్తుంటారని, అదే సమయంలో వారు కాంప్లెక్స్‌లో కనిపించే కుక్కల వెంబడి పరుగెత్తుతుంటారని చెప్పారు. అదే సమయంలో వయోధికులు అక్కడ ఉంటే వారు భయపడుతున్నారని, భద్రంగా నడువలేకున్నారని వివరించారు. అంతేకాదు, ఈ వీధి కుక్కల వల్ల పరిశుభ్రతకూ భంగం కలుగుతున్నదని చెప్పారు. పార్కింగ్ స్పేస్, ఇతర ప్రాంతాల్లో అంతా అపరిశుభ్రం చేస్తున్నాయని వివరించారు. రాత్రి పూట కూడా ఏడుస్తూ ఉంటున్నాయని, తద్వార సొసైటీలోని నివాసులు రాత్రిపూట సుఖంగా నిద్రపోయే పరిస్థితీ లేదు అని పేర్కొన్నారు. అయితే, ఈ హౌజింగ్ సొసైటీలో కుక్కల కోసం ప్రత్యేక ఆవాసాలు ఉన్నాయని వివరించారు. కానీ, కొందరు ఇప్పటికీ కుక్కలకు ఆ ఆవాసాల్లో కాకుండా బయటే ఫుడ్ పెడుతున్నారని చెప్పారు. ఈ పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా.. వీధి కుక్కలకు వారు ఆహారం పెట్టడాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. ఫైన్‌లకూ జంక కుండా మూగ జీవాలపై ప్రేమను చాటుకుని ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios