ఎన్నో సంస్థలు తమ కస్ట‌మర్లకు సేవలు అందించి మంచి పేరు కొట్టేస్తుంటే... మరికొన్ని సంస్థలు మాత్రం శవాలపై చిల్లర ఏరుకునేలా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన మహిళ ఖాతా నుంచి ట్రిప్ డబ్బులు కట్ చేసింది ఉబెర్ క్యాబ్స్. ముంబైకి చెందిన తాంజిలా షేక్ అనే 35 ఏళ్ల మహిళ గత నెల 14న మరో ప్రాంతానికి వెళ్లేందుకు గాను ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుని.. గమ్యస్థానానికి బయలేదేరారు.

ఈమె ప్రయాణిస్తున్న కారు ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై నో పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేసి ఉన్న ఓ వ్యాన్‌ను ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన తాంజిలా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్యాసింజెర్‌ గురించి సమాచారం ఇవ్వాల్సిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతన్ని తర్వాతి రోజే అరెస్ట్ చేశారు. తమ కారులో ప్రయాణిస్తున్న ప్యాసింజెర్ మరణించినప్పుడు నష్టపరిహారం చెల్లించాల్సింది పోయి.. చనిపోయిన వ్యక్తి ఖాతాలోంచి రైడ్ ఛార్జిగా రూ. 568ని కట్ చేసింది ఉబెర్.

ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత తన భార్య చెక్ చేసినప్పుడు ఈ విషయం తెలిసిందని తాంజిలా భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అరెస్ట్ అయిన డ్రైవర్ సైతం తర్వాతి రోజే బయటకు వచ్చాడని.. ఉబెర్‌కు ఫిర్యాదు చేస్తే రైడ్ డబ్బులు వాపస్ చేస్తామంటున్నారని.. దర్యాప్తు ఖర్చుల కోసం ఇన్సూరెన్స్‌ డబ్బులో వాటా అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఉబెర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.