ఓ లేడీ కిలేడీని బెంగళూరులో అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో ఓ యువకుడిని రూ.9 లక్షలు మోసం చేసింది. 

చెన్నై : కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఓ యువకుడిని పెళ్లి పేరుతో మోసగించింది. అతడి నుంచి దాదాపు రూ.9 లక్షలు వసూలు చేసింది. బెంగళూరుకు చెందిన ఈ లేడీ కిలాడిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని అయ్యప్పాకన్ కాల్ సెంటర్లో పనిచేస్తున్న అశోక్ చైతన్య (33) అనే యువకుడిని ఈ లేడీ కిలేడీ మోసం చేసింది.

ఆ యువకుడు పెళ్లి కోసం ఓ మాట్రిమోనీ సంస్థలో తన పేరు నమోదు చేసుకున్నాడు. వధువు కోసం వెతుకుతున్నాడు. అలా మ్యాట్రిమోనీ మెయిల్లో మదనపల్లెకు చెందిన శ్రావణ సంధ్య అనే యువతి అతనితో పరిచయం చేసుకుంది. ఆమె తన ఫోటోలను కాకుండా ఓ అందమైన మోడల్ ఫోటోలను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లలో అప్లోడ్ చేసింది. అవి తన ఫోటోలేనని చెప్పింది.

నార్త్ ఇండియాలో వర్ష బీభత్సం.. 37 మంది దుర్మరణం.. హిమాచల్‌కు వరద హెచ్చరిక, ఉత్తరాఖండ్‌కు హై అలర్ట్..

వాటిని చూసిన అశోక్ చైతన్య ఫిదా అయ్యాడు. ఆమెతో చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. తన బుట్టలో పడ్డాడని గమనించిన తర్వాత ఆ యువతి అశోక్ చైతన్యతో తనకు అవసరాలు ఉన్నాయంటూ డబ్బులు అడగడం మొదలుపెట్టింది. పూర్తిగా ఆమె మాయలో పడిన అశోక్ అడిగినంత సొమ్ముని అకౌంట్లో వేస్తుండేవాడు. ఇటీవల ఓ ఖరీదైన సెల్ ఫోన్ను కూడా పార్సెల్ చేశాడు.

అలా దాదాపుగా 9 లక్షల రూపాయల వరకు ఆ యువతికి అశోక్ చైతన్య ముట్ట చెప్పాడు. ఇటీవల పెళ్లి చేసుకుందాం అంటూ ఆ యువతిని అడిగాడు. దీంతో ఆమె అశోక్ చైతన్యతో చాటింగ్ చేయడం మానేసింది. ఫోన్లో అశోక్ నెంబర్ బ్లాక్ చేసింది. ఈ పరిణామాలతో షాక్ అయిన చైతన్య.. తాను మోసపోయానని గ్రహించాడు. 

అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిద్దరి సెల్ ఫోన్ నెంబర్లు ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ చాటింగ్లను పరిశీలించారు. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానంతో శ్రావణ సంధ్య అనే యువతి బెంగళూరులో ఉన్నట్లుగా గుర్తించారు. ఆమెను అరెస్టు చేశారు. అయితే శ్రావణ సంధ్య కు ఇలా మోసం చేయడం అలవాటే అని వారి విచారణలో తేలింది.

అంతకు ముందు కూడా పెళ్లి చేసుకుంటానని ఆశచూపించి డబ్బులు దోచుకుందని తేలింది. లక్షలాది రూపాయలను మోసగించిందని పోలీసుల విచారణలో తేలింది. శ్రావణసంధ్యను బెంగళూరులో అరెస్ట్ చేసి చెన్నై తీసుకువచ్చిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. తరువాత జైలుకు తరలించారు.