ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. గత రెండు రోజుల్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వర్షాలకు సంబంధించిన ఇతర సంఘటనల కారణంగా కనీసం 37 మంది మరణించారు.
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. గత రెండు రోజుల్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వర్షాలకు సంబంధించిన ఇతర సంఘటనల కారణంగా కనీసం 37 మంది మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా వరదలు, కొండచరియలు విరిగిపడిన వేర్వేరు ఘటనల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్, హర్యానాలో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు.. వర్షాలకు సంబంధించిన వేర్వేరు సంఘటనలలో మరణించారు.
ఢిల్లీలోని యమునా సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు రహదారులు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలు, వరదలను ఎదుర్కొవడానికి మొత్తం 39 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలను నాలుగు ఉత్తర భారత రాష్ట్రాల్లో మోహరించారు. పంజాబ్‌లో 14 బృందాలు పనిచేస్తుండగా.. హిమాచల్‌ప్రదేశ్‌లో 12, ఉత్తరాఖండ్‌లో 8, హర్యానాలో ఐదు బృందాలను అందుబాటులో ఉంచారు.
భారీ వర్షాలతో.. జమ్మూలో 7,000 మందికి పైగా అమర్‌నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా భగవతినగర్ బేస్ క్యాంపులో వారు చిక్కుకున్నారు. మరోవైపు రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ బేస్ క్యాంపులో 5,000 మందికి పైగా చిక్కుకుపోయారు. అయితే పరిపాలన అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రోజంతా చేసిన సమిష్టి కృషి ఫలితంగా రహదారి పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల ఏర్పడిందని ట్రాఫిక్ అధికారులు ఒక సలహాను జారీ చేశారు.
ఇక, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసిన నేపథ్యంలో మంగళవారం యాత్రికులు జమ్మూ నుంచి కాశ్మీర్‌కు బయలుదేరనందున అమర్‌నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
హిమాచల్‌ప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం..
సోమవారం లాహౌల్, స్పితిలలోని చందర్తాల్, పాగల్ నల్లా, ఇతర ప్రదేశాలలో 300 మందికి పైగా పర్యాటకులు, స్థానికులు చిక్కుకుపోయారు. గల్లంతైన 300 మందిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. వాతావరణం అనుకూలిస్తే వారిని విమానంలో తరలించవచ్చని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు తెలిపారు.
మరోవైపు అయితే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులు, హోంగార్డులు 515 మంది ఉనా జిల్లాలోని లాల్సింగి వద్ద ఉన్న ప్రాంతాల్లోని కార్మికులను మురికివాడల నుంచి రక్షించారు. ఇక, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది.
భారీ వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని.. ఇది రూ. 3,000-రూ. 4,000 పరిధిలో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు అని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక, రాష్ట్రంలో దాదాపు 800 రోడ్లు మూసుకుపోయాయి. రవాణా శాఖ అధికారుల ప్రకారం.. హిమాచల్ రోడ్‌వేస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ) 1,255 రూట్లలో బస్సు సర్వీసులు నిలిపివేయబడ్డాయి. 576 బస్సులు వివిధ ప్రదేశాలలో నిలిచిపోయాయి.
చండీగఢ్-మనాలి జాతీయ రహదారి కొండచరియలు విరిగిపడటం, పలుచోట్ల వరదల కారణంగా మూసుకుపోయింది. సిమ్లా-కిన్నౌర్ రహదారి కూడా స్లైడ్‌లు,రాళ్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వాతావరణ శాఖ సోమవారం ఉదయం హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని 12 జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (204 మి.మీ. పైన) కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 11న కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది.
కొండచరియలు పలుచోట్ల రైల్వే ట్రాక్‌లపై పడిపోవడంతో సిమ్లా-కల్కా మార్గంలో రైళ్ల కార్యకలాపాలను మంగళవారం వరకు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు సోమ, మంగళవారాల్లో మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కులులోని శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర కూడా ముగిసింది. జూలై 10, 11 తేదీల్లో కులు జిల్లాలో రెండు రోజులపాటు ప్రభుత్వ సెలవులు ప్రకటించగా.. ఫీల్డ్ ఆఫీసర్లందరి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి, వెంటనే విధులకు హాజరుకావాలని కులు పరిపాలన విభాగం ఆదేశాలు జారీచేసింది. సోమవారం ఉనాలో 175 మి.మీ, సోలన్‌లో 170 మి.మీ, దధౌ 160 మి.మీ, సంగ్రహ 150 మి.మీ, రాంపూర్‌లో 145 మి.మీ, సిమ్లాలో 139 మి.మీ, నర్కండలో 132 మి.మీ, సుజన్‌పూర్ తీరా, కసౌలిలో 130 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఇదిలావుండగా.. ఉత్తర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల మధ్య హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీలో అధికారులు సోమవారం సాయంత్రం యమునా వరద మైదానాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడం ప్రారంభించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యున్నత స్థాయి సమావేశంలో నీటి ఎద్దడి పరిస్థితి, యమునా నదిలో ప్రవాహం పెరుగుదలపై చర్చించారు. ప్రస్తుతానికి వరద ముప్పు లేదని చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం.. హర్యానా యమునానగర్‌లోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నదిలోకి ఎక్కువ నీటిని విడుదల చేయడంతో ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద సాయంత్రం 5 గంటల సమయానికి నీటి మట్టం 205.4 మీటర్లకు పెరిగింది.
ఢిల్లీలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల సూచనల దృష్ట్యా జూలై 11న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించే ఎయిడెడ్ లేదా గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలు మూసివేయబడతాయి. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. ప్రగతి మైదాన్ సొరంగంలో నీటి ఎద్దడి కారణంగా సోమవారం వరుసగా రెండో రోజు రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో పలుచోట్ల రహదారులపై నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే.. భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకోవడంతో పంజాబ్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన 910 మంది విద్యార్థులతో పాటు మరో 50 మందిని ఆర్మీ రక్షించింది. హర్యానాలోని పలు ప్రాంతాలు సోమవారం కూడా జలమయమయ్యాయి.రెండు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం జూలై 13 వరకు రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. గత మూడు రోజులుగా చండీగఢ్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని మొహాలి, పాటియాలా, రూప్‌నగర్, ఫతేఘర్ సాహిబ్, పంచకుల ,అంబాలా జిల్లాలు భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన ముందస్తు షెడ్యూల్ చేసిన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసి.. వివిధ శాఖల సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని పిలిచారు.
ఇక, ఉత్తరాఖండ్‌లో సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారితో పాటు పలు రహదారులు మూసుకుపోయాయని అధికారులు తెలిపారు. అయితే కొన్ని గంటల తర్వాత హైవేపై ట్రాఫిక్ పునరుద్ధరించబడిందని.. ఇంకా మూసివేయబడిన ఇతర రహదారులను తెరవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు.
ఇదిలాఉంటే, ఉత్తరప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో నదులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
రాజస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని తూర్పు, మధ్య ప్రాంతాలలో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు, రైలు పట్టాలు, ఆసుపత్రులను కూడా వరదలు ముంచెత్తాయి. మంగళవారం కూడా దాదాపు పదికి పైగా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని మురళీపురా ప్రాంతంలో పొంగిపొర్లుతున్న డ్రెయిన్‌లో సోమవారం ఏడేళ్ల బాలుడు కొట్టుకుపోయాడు. అక్కడ అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.అజ్మీర్‌లో ముగ్గురు, నాగౌర్‌లో ఇద్దరు, టోంక్‌లో ఒకరు మరణించారు.