బెంగళూరులో ఓ టీచర్ హత్యకు గురయ్యింది. డైవోర్సీ అయిన ఆ మహిళ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమె మెడమీద మూడుసార్లు కత్తితో దాడిచేసి చంపేశాడు. 

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఓ మహిళ తనింట్లోనే హత్యకు గురయ్యింది. శాంతినగర్ సమీపంలోని నంజప్ప సర్కిల్‌లోని ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో సోమవారం మధ్యాహ్నం 34 ఏళ్ల మహిళను కత్తితో పొడిచి చంపారు. మృతురాలిని కౌసర్ ముబీనాగా గుర్తించారు. హోసూర్ రోడ్‌లోని లాల్‌బాగ్ సమీపంలోని ప్రైవేట్ స్కూల్‌లో టీచర్ గా పనిచేస్తుంది. బాధితురాలు విడాకులు తీసుకున్న ఒంటరి మహిళ. ఈ కేసులో హంతకుడు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

హంతకుడికి మృతురాలి గురించి తెలుసునని, అతడికి సంబంధించి కొన్ని ఆధారాలు ఉన్నాయని, అతడిని కనిపెట్టి అరెస్టు చేసేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సెంట్రల్) ఆర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇంట్లో విలువైన వస్తువులన్నీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. దీంతో దోపిడీ దొంగల పని కాదని క్రైం సీన్ విచారణలో తేలింది. ఇది ముబీనాకు తెలిసిన వ్యక్తి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు, తదుపరి విచారణ కొనసాగుతోంది.

వంట చేయకుండా.. పక్కింటావిడతో ముచ్చట్లు పెడుతోందని.. దుడ్డుకర్రతో కొట్టి భార్యను హతమార్చిన భర్త..

మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో హత్య జరగగా, ముబీనా కేకలు విన్న ఇరుగుపొరుగు వారు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. చుట్టు పక్కల వారు వచ్చేసరికి ఆమె ఇంట్లో నుంచి ఓ వ్యక్తి పారిపోతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముబీనా మెడపై దుండగుడు మూడుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆమె ఇంటి గుమ్మం దగ్గర కుప్పకూలి రక్తపు మడుగులో పడి మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అశోకనగర్ పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులను పిలిపించి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.

ముబీనాకు ఓ కూతురు ఉంది. ఆమె ఓ ప్రైవేట్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. తల్లీకూతుళ్లిద్దరే ఆ ఇంట్లో ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటన జరిగినప్పుడు ఆమె కుమార్తె పాఠశాలలో ఉంది. ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముబీనా విడాకులు తీసుకున్నప్పటికీ, ఆమె మాజీ భర్తతో విభేదాలు ఉన్నాయని చెప్పారు.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 10న బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌ ఇలాగే హత్యకు గురయ్యింది. ఇంటికి తిరిగి వస్తున్న మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన కతిహార్ జిల్లా సమీపంలోని భట్వారా పంచాయతీ భవన్ సమీపంలో ఎన్ హెచ్ 81లో రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ మహిళ ముంగేర్ జిల్లా వాసి. ఘటనా స్థలం నుంచి రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న మహిళను మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 

సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. “మేము ఇంకా దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నాం. దీనిపై విచారణ జరుపుతాం' అని కతిహార్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ తెలిపారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని కేసుకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని కూడా కతిహార్‌కు పంపినట్లు అధికారి తెలిపారు.

మృతురాలు ప్రభకుమారి అనే మహిళా కానిస్టేబుల్ తన తల్లిదండ్రులతో కలిసి భట్వారా గ్రామంలో ఉంటోంది. కాగా, ప్రభకుమారికి చోటు అలియాస్ అర్షద్ అనే వ్యక్తితో ప్రేమవ్యవహారం ఉండేది. అయితే, గత కొద్ది రోజులగా ప్రభకుమారి అర్షద్ ను దూరం పెడుతోంది. దీంతో కోపానికి వచ్చిన అతను ఆమెను చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు ఫోన్లు చేసి ఈ మేరకు బెదిరింపులకు పాల్పడ్డాడని ప్రభకుమారి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ప్రభకుమారిని హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.