భార్య వంట చేయలేదని ఓ భర్త దుడ్డుకర్రతో చావబాదాడు. దీంతో ఆమె మరణించింది. అయితే.. మూర్ఛవ్యాధితో చనిపోయిందంటూ కథలల్లాడు.
ఛత్తీస్ గఢ్ : ఓ వ్యక్తి మధ్యాహ్నం భోజనానికి వచ్చేవరకు భార్య వంట చేయలేదని ఆమెని విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో ఆమె చనిపోయింది. ఈ దారుణమైన ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కవర్ధా జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సురేష్ బైగా అనే 28 ఏళ్ల వ్యక్తి వంట చేయలేదన్న కారణంతో భార్యని చితక కొట్టి చంపేశాడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి భార్య వంట చేయకుండా.. పక్కింటి మహిళతో ముచ్చట్లు పెడుతుండడం అతడి ఆగ్రహానికి కారణమైంది. పట్టరాని కోపం, దానికి తోడు ఆకలి మంట కలిసి ఏం చేస్తున్నాడో తెలియని విచక్షణారాహిత్యంలో భార్యను చంపేశాడు. ఆ తర్వాత తేరుకుని తాను చేసిన పనికి షాక్ అయ్యాడు.
వెంటనే అత్తామామల ఇంటికి వెళ్లి భార్య మూర్ఛ వ్యాధితో మరణించిందని చెప్పాడు. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వారు తెలిపిన వివరాల మేరకు.. ఈ ఘటన ఫిబ్రవరి ఏడవ తేదీన జరిగింది. సురేష్ ఆరోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. అప్పటికి అతడి భార్య ఇంద్రావతి(24) ఇంకా వంట చేయలేదు. పక్కింటి మహిళతో ముచ్చట్లు పెడుతూ కూర్చుంది. అది చూసిన సురేష్ తీవ్ర కోపానికి వచ్చాడు.
ఆకలితో ఇంటికి వస్తే వంట చేయలేదంటూ దుడ్డుకర్రతో ఆమెను చావబాదాడు. ఆ దెబ్బలకు తాళలేక ఇంద్రావతి అక్కడికక్కడే కిందపడి మరణించింది. అయితే, ఇలా జరుగుతుందని ఊహించని సురేష్ షాక్ అయ్యాడు. వెంటనే పక్క వీధిలో ఉన్న అత్తమామల ఇంటికి వెళ్ళాడు. తన భార్య ఇంద్రావతికి మూర్చ వచ్చి.. గబాలన కింద పడడంతో చనిపోయిందంటూ అత్తమామలకు చెప్పి నమ్మించాడు. అల్లుడు చెప్పింది విన్న ఇంద్రావతి తల్లిదండ్రులు కూతురు ఇంటికి వచ్చారు.
ఫిబ్రవరి 8వ తేదీన.. ఘటన జరిగిన తెల్లారి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఇంద్రావతి శరీరంపై గాయాలు ఉండడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తర్వాత వారు తమ అనుమానాన్ని వ్యక్తపరుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేశారు.
వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం నివేదికలో శరీరంపై గాయాలు ఉన్నాయని.. దుడ్డు కర్ర లాంటి దానితో కొట్టడం వల్ల గాయాలయ్యాయని వాటితోనే ఆమె మరణించింది అని తేలింది. దీంతో పోలీసులు భర్త సురేష్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆ తర్వాత సురేష్ నేరాన్ని అంగీకరించాడు.
