తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని తొలగించిన గవర్నర్ ఆర్ఎన్ రవి రాత్రి 11 గంటల తర్వాత తన ఆదేశాలను ఉపసంహరిస్తున్నట్టు వివరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు.
చెన్నై: తమిళనాడులో ప్రస్తుతం గవర్నర్ తీరు వివాదాస్పదమైంది. మంత్రి సెంథిల్ బాలాజీని గవర్నర్ ఆర్ఎన్ రవి ఏకపక్షంగా తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు మరో ఉత్తర్వులు చేశారు. ఈ ఘటనపై డీఎంకే, కాంగ్రెస్‌లు స్పందిస్తూ.. గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుపట్టాయి. ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గవర్నర్ ఆర్ఎన్ రవి.. తాను సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించాలని అనుకున్నది.. ఎందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నదీ వివరించారు.
మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సెంథిల్ బాలాజీపై ఇంకా పలు కేసులు ఉన్నందున తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్టు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. ఆయన జైలులో ఉన్నందున మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్టు సీఎం స్టాలిన్‌కు లేఖలు రాసినట్టు వివరించారు. రాష్ట్ర మంత్రి మండలి సూచనలకు అనుగుణంగా గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుందన్న విషయం తనకు తెలుసు అని, కానీ, ఇన్ని ఆరోపణలు ఉన్న వీ సెంథిల్ బాలాజీని మంత్రిగా కొనసాగించాలన్న సీఎం స్టాలిన్ నిర్ణయం పక్షపాతాన్ని వెల్లడిస్తుందని పేర్కొన్నారు.
సెంథిల్ మంత్రిగా ఉంటే న్యాయ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని ఆర్టికల్ 154, 163, 164 కింద తనకు దక్కిన అధికారాలతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. అనంతరం, రాత్రి 11.45 గంటలకు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు మరో లేఖ విడుదల చేశారు.
Also Read: Manipur Violence: సీఎం బీరెన్ సింగ్ రాజీనామా?.. గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాలు..
మంత్రి సెంథిల్ బాలాజీని తొలగించడంపై అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తనకు సూచించినట్టు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. ఆయన సూచనల మేరకు తాను అటార్నీ జనరల్‌ను సంప్రదిస్తున్నట్టు వివరించారు. అప్పటి వరకు బాలాజీ మంత్రి పదవి తొలగింపు ఆదేశాలు పెండింగ్‌లో ఉంటాయని చివరి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్ర పెత్తనాన్ని ఇది స్పష్టంగా వివరిస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు.
