సుమారు 60 రోజుల నుంచి హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్న మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఈ రోజు రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు ఆయన గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాలు అందిస్తారని తెలిసింది.
న్యూఢిల్లీ: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఈ రోజు రాజీనామా చేసే అవకాశం ఉన్నదని ఆయనకు దగ్గరగా ఉండే మణిపూర్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే సీఎం బీరెన్ సింగ్ గవర్నర్ అనుసూయ యూకీ అపాయింట్‌మెంట్ తీసుకున్నారని కొన్ని వర్గాలు తెలిపాయి. గవర్నర్ యూకీని కలిసి రాజీనామా పత్రాలను సీఎం బీరెన్ సింగ్ అందిస్తారని వివరించాయి.
స్థానిక వార్తా పత్రిక సంగయి ఎక్స్‌ప్రెస్ ఈ రోజు ఓ కథనం ప్రచురించింది. దీంతో సీఎం బీరెన్ సింగ్ రాజీనామాపై చర్చ మొదలైంది. రాష్ట్రంలో పెచ్చరిల్లిన హింసను నియంత్రించడంలో సీఎం బీరెన్ సింగ్ విఫలమయ్యారనే ప్రధాన కారణంతోనే ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది.
ఢిల్లీ నుంచి గురువారం ఆయనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని, రాజీనామా పత్రాలు అందించాలని లేదంటే.. కేంద్రమే రాష్ట్ర పాలనను అదుపులోకి తీసుకుంటుందనే ఆప్షన్‌ను ఆయనకు చెప్పినట్టు ఆ కథనం పేర్కొంది. సీఎం లేకుండా తాత్కాలికంగా అసెంబ్లీని నడిపే యోచనలో కేంద్రం ఉన్నట్టు వివరించింది. అయితే, సీఎం బీరెన్ సింగ్ రాజీనామాపై అధికారిక ధ్రువీకరణ ఇప్పటికైతే లేదు.
Also Read: Manipur Violence: మణిపూర్‌కు రాహుల్ గాంధీ.. అడ్డుకున్న పోలీసులు.. వెనుదిరిగిన కాన్వాయ్
మణిపూర్ గవర్నర్ యూకి రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. అక్కడ గవర్నర్ యూకీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ షింగ్ సహా పలువురు కీలక నేతలతో సమావేశమై.. మణిపూర్ పరిస్థితులను తెలియజేశారు. హింసాకాండను అదుపులోకి తీసుకోవడానికి చేపట్టిన చర్యలనూ వివరించారు.
రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న మణిపూర్ వెళ్లిన సందర్భంలో ఈ చర్చ జరగడం గమనార్హం.
మణిపూర్ గత నెల 3వ తేదీ నుంచి మైతేయి, కుకి తెగల మధ్య హింస జరుగుతున్నది. మైతేయిలకు గిరిజన హోదా కల్పించాలనే హైకోర్టు సిఫారసులు తక్షణ కారణంగా మారాయి. మైతేయి వర్గానికి చెందిన సీఎం బీరెన్ సింగ్ కూడా కుకీలకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం చర్చనీయాంశమయ్యాయి.
నిన్న రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనకు వెళ్లారు. ఇంఫాల్‌లో దిగి హింసకు కేంద్రంగా ఉన్న చురాచాంద్‌పూర్ వైపు వెళ్లగా బిష్ణుపూర్ వద్ద పోలీసులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆయన కాన్వాయ్ ఇంఫాల్‌కు వెనుదిరిగింది. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్‌లో పర్యటనకు వెళ్లారు. తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్న బాధితులను కలిశారు. బాధితులకు ఆత్మీయ స్పర్శ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పర్యటన చేపట్టారు.
