పంట వ్యర్థాలను దహనం చేసే సమస్యను తాము బాధ్యత తీసుకుంటామని, వచ్చే ఏడాది నవంబర్ కల్లా పంజాబ్‌లో ఈ సమస్యకు కళ్లెం వేస్తామని ఆప్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ ప్రకటించారు. ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో కాలుష్యం ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం జాయింట్ యాక్షన్ ప్లాన్ తేవాలని డిమాండ్ చేశారు. 

న్యూఢిల్లీ: వాయు కాలుష్యం అనేది దేశవ్యాప్తంగా కనిపిస్తున్న సమస్య, ముఖ్యంగా ఉత్తర భారతంలో చాలా చోట్ల ఇది ఎక్కువగా ఉన్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు విలేకరుల సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీని నియంత్రణకు పూనుకోవాలని వివరించారు. అలాగే, పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనంపై బాధ్యత తీసుకుంటామని, త్వరలోనే దాన్ని కట్టడి చేస్తామని చెప్పారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది. రెండో రోజూ తీవ్రమైన కేటగిరీలోనే ఉన్నది. ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌లు పక్కపక్కనే కూర్చుని విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఢిల్లీలో, పంజాబ్‌లోనూ తమ ప్రభుత్వాలే ఉన్నాయని వివరించారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలలు మాత్రమే గడిచిందని భగవంత్ సింగ్ మాన్ అన్నారు. అందులో కొన్ని నెలలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు చేయడానికే సరిపోయాయని వివరించారు. కాబట్టి, ఈ సమస్యను తీర్చడానికి తమకు మరో ఏడాది కాలం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే పంట వ్యర్థాలను తగ్గించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాటి ఫలితాలు రావడానికి మరికొంత కాలం ఆగాలని, వచ్చే ఏడాది నవంబర్ కల్లా వీటి ఫలాలు కనిపిస్తాయని వివరించారు. తాము ఈ సమస్యను బాధ్యత తీసుకుంటున్నామని, దీని నుంచి పారిపోవడం లేదని మాన్ తెలిపారు. వంద శాతం బాధ్యత తీసుకుంటామని అన్నారు.

రైతుల పంట పెరిగిందని, కాబట్టి, పంట వ్యర్థాలూ పెరిగాయని, ఫలితంగా కాల్చడం కూడా పెరిగి కాలుష్యం హెచ్చడానికి కారణమైందని వివరించారు. వచ్చే ఏడాది రైతులను వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. అలాగే, ఢిల్లీలోనూ వాయు కాలుష్యం తీవ్రతరం కావడానికి కేవలం కేజ్రీవాల్ ప్రభుత్వమే కారణం కాదని అన్నారు. 

Also Read: ఢిల్లీ గ్యాస్‌ చాంబర్‌గా మారింది - పంజాబ్‌ ఆప్‌ ప్రభుత్వంపై మండిపడ్డ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్

ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, గాలి కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక జాయింట్ యాక్షన్ ప్లాన్ తీసుకురావాలని అన్నారు. అంతేకానీ, ఒకరి వైపు మరొకరు వేలు చూపించుకుంటే పరిష్కారం లభించదని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. ఒకరి పై మరొకరు నిందను మోపడానికి ఇది సరైన సమయం కాదని అన్నారు.

గాలి కాలుష్యం పెరిగిన కారణంగా రేపటి నుంచి ప్రైమరీ పాఠశాలలను మూసివేస్తున్నారు. అవసరమైతే మళ్లీ సరి బేసి విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఐదో తరగతి పిల్లలకు ఔట్ డోర్ స్పోర్ట్స్ యాక్టివిటీలను నిలిపేసినట్టు పేర్కొన్నారు.

Also Read: పంట వ్యర్థాలను కాల్చని గ్రామానికి రూ. 1 లక్ష ఆఫర్.. పంజాబ్ స్పీకర్ ప్రకటన

ఢిల్లీ కాలుష్యంలో 34 శాతం పంట వ్యర్థాల వల్లే జరుగుతున్నదని సఫర్ (SAFAR) తెలిపింది. గతేడాదితో పోల్చితే 7 శాతం పెరిగింది. పంట వ్యర్థాలను తగ్గించేలా చర్యలు తీసుకోకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని పంజాబ్ ప్రభుత్వం విమర్శిస్తున్నది.