పంజాబ్‌లో పంట వ్యర్థాలను కాల్చవద్దని నేతలు కొన్నేళ్ల నుంచి పిలుపు ఇస్తున్నారు. కానీ, పంజాబ్ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంట వ్యర్థాలు కాల్చని గ్రామ పంచాయతీకి రూ. 1 లక్ష అందిస్తానని ఆఫర్ ప్రకటించారు. 

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో చలికాలం వస్తున్నదంటే వణికిపోతున్నారు. ఆ వణుకు కేవలం చలికే కాదు.. వాతావరణంలో గాలి కాలుష్యానికి కూడా. వాహనాలు, పరిశ్రమల ఉద్గారాలతోపాటు పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కూడా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటున్నదనేది స్థానికుల వాదన. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం ఏర్పడుతున్నట్టూ వాదించేవారు. అత్యధిక పంట పండించే రాష్ట్రం పంజాబ్‌లో పంట వ్యర్థాలను కాల్చడం ఎక్కువ మంది రైతులు పాటిస్తున్న విధానం. దీన్ని అడ్డుకోవడానికి, అవగాహన కార్యక్రమాలు, ఇతర అనేక మార్గాల ద్వారా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, పంజాబ్ స్పీకర్ చేసిన ప్రకటన మాత్రం వీటన్నింటికి విరుద్ధంగా, తక్షణమే ఫలితాలు ఇచ్చేలా ఉన్నది. పంట వ్యర్థాలను కాల్చని గ్రామానికి రూ. 1 లక్ష ఇస్తానని ఆయన ప్రకటించారు.

పంట వ్యర్థాలను కాల్చడాన్ని నివారించడానికి పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధవాన్ సంచలన ప్రకటన చేశారు. తన అసెంబ్లీ సెగ్మెంట్‌లో రైతులు పంట వ్యర్థాలను కాల్చే సంప్రదాయాన్ని వదులుకున్న గ్రామ పంచాయతీకి రూ. 1 లక్ష అందిస్తానని ఆదివారం ప్రకటించారు. ఆయన డిస్క్రెషనరీ కోటా నుంచి ఈ డబ్బులు ఇస్తానని ఆయన తన అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఈయన పంజాబ్‌లో కొట్కాపురా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Also Read: ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కూర్చుని రైతులను నిందిస్తారు.. ఢిల్లీ కాలుష్యం విచారణలో సుప్రీం సీరియస్

పంట వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణానికే కాదు.. సారవంతమైన భూమికి కూడా నష్టమే అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు దీని దుష్ప్రభావాలను అర్థం చేసుకుంటున్నారని, త్వరలోనే ఈ సంప్రదాయాన్ని వదులుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసంప్రదాయాన్ని మొత్తంగానే వదిలిపెట్టే రోజులు మరెంతో దూరం లేవని పేర్కొన్నారు. 

పంట వ్యర్థాలను కాల్చని రైతులను ఆయన గతవారం సన్మానించారు. ఇది ఒక గొప్ప విధానమని, ఇలాంటి విధానాల ద్వారా మార్పు తీసుకురావచ్చని వివరించారు.