Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు? స్పీకర్ కోర్టులో బంతి.. పూర్తి వివరాలివే

రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడని ప్రకటిస్తారా? సూరత్ కోర్టు ఆయనను ఓ పరువునష్టం కేసులో దోషిగా తేల్చడంతో ఈ చర్చ మొదలైంది. దీనిపై నిపుణులు కీలక విషయాలు పేర్కొంటున్నారు. అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ వద్ద ఉన్నదని చెబుతున్నారు.
 

will rahul gandhi be disqualified as MP, decision is in the hands of speaker kms
Author
First Published Mar 23, 2023, 5:23 PM IST

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని సూరత్ కోర్టు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఓ కేసులో దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. మోడీ పేరును పేర్కొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ ఎమ్మెల్యే సూరత్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. దీంతో డిఫమేషన్ కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. చట్టాలను పరిశీలిస్తే మాత్రం వయానాడ్ ఎంపీపై అనర్హత వేటు పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. వెనకా ముందో రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడని తేలుస్తారని తెలుస్తున్నది.

ప్రభుత్వ సీనియర్ అడ్వైజర్ కాంచన్ గుప్తా ఈ విషయంపై స్పష్టత ఇస్తూ ట్విట్టర్‌లో కీలక విషయాలను ప్రస్తావించారు. లిలీ థామస్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో 2013 జులై 10వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును పేర్కొన్నారు. ఏ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయినా ఒక నేరంలో దోషిగా తేలి రెండేళ్ల జైలు శిక్ష పడితే.. వారు చట్ట సభలో సభ్యత్వాన్ని తక్షణమే కోల్పోతారు అనే రూలింగ్‌ను గుర్తు చేశారు.

ప్రజాస్వామ్యంలో ఎవరూ చట్టానికి అతీతులు కారని ఆయన పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని, కాబట్టి, అదే రూల్ రాహుల్ గాంధీకి కూడా వర్తిస్తుందని తెలిపారు.

రూల్ బుక్ ఏం చెబుతున్నది?
రూల్ బుక్ ప్రకారం, కేసులో దోషిగా తేలిన తర్వాత వయానాడ్ ఎంపీ రాహుల్ గాంధీని అనర్హుడిగా చేసే హక్కులు పూర్తిగా స్పీకర్ వద్దే ఉన్నాయి. ఐపీసీలోని సెక్షన్లు 499, 500 కింద రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును పైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. 30 రోజులపాటు శిక్షను సస్పెండ్ చేసింది. అప్పీల్‌ను డిసైడ్ చేసే నిర్ణయం పైకోర్టులో చేతిలో ఉన్నది. అప్పటి వరకు రాహుల్ పై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు ఉన్నది.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం, కనీసం రెండేళ్లు జైలు శిక్షతో ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తిని అదే రోజున డిస్‌క్వాలిఫై చేయవచ్చు. ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరేళ్లపాటు అదే అనర్హత కొనసాగించవచ్చు.

యూపీఏ కాలంనాటి ఆర్డినెన్స్ గుర్తు చేస్తున్న బీజేపీ:
ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు శరద్ యాదవ్ వంటి కొందరు ఎంపీలు అనర్హత నిర్ణయం తీసుకోవడానికి శిక్షను రెండేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచుతూ సవరణ చేయాలని కోరారనే విషయాన్ని బీజేపీ నేత మీనాక్షి లేఖి రాహుల్ గాంధీకి గుర్తు చేశారు. కానీ, ఆ ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ తిరస్కరించారు. ఈ ఆర్డినెన్స్ అర్థం లేనిదని, నాన్సెన్స్ అని రాహుల్ అప్పుడు పేర్కొన్నారు.

Also Read: సెల‌వు రోజు ప‌నికి నో చెప్ప‌డానికి ఐదేండ్లు ప‌ట్టింది.. చివరకు ఏం జరిగిందంటే..? వైర‌ల్ పోస్ట్ !

రాహుల్‌ను సమర్థిస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ సహా పలువురు పార్టీ నేతలు రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడారు. సామ, దాన, బేద, దండోపాయాలతో రాహుల్ గాంధీ గళాన్ని అణచివేయడానికి అధికార యంత్రాంగా ఎంతో ప్రయత్నిస్తున్నదని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. తన సోదరుడు ఎప్పడూ భయపడలేదని, భయపడబోడని స్పష్టం చేశారు. రాహుల్ తన జీవితమంతా నిజాలు నిర్భయంగా మాట్లాడుతూనే ఉన్నాడని, ఇకపైనా మాట్లాడుతారని పేర్కొన్నారు. దేశ ప్రజా గొంతుకై ఇకపైనా గర్జిస్తూనే ఉంటాడని వివరించారు.

ఈ తీర్పుపై అప్పీల్ చేస్తామని పేర్కొంటూ మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై విమర్శలు చేశారు. ఒక వేలితో ఎదుటి వ్యక్తిని చూపిస్తే.. మిగితా నాలుగు తమనే చూస్తాయని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఒక నియంతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే అని తెలిపారు. తప్పును తప్పు అని చెప్పే ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారని వివరించారు. ఆ తెగువను చూసే నియంతకు చెమటలు పడుతున్నాయని, అందుకే ఆయన కొన్నిసార్లు ఈడీ, కొన్ని సార్లు పోలీసులు, కొన్ని సార్లు కేసులు, ఇంకొన్ని సార్లు శిక్షల ద్వారా రాహుల్ గాంధీ గొంతును అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios