Asianet News TeluguAsianet News Telugu

Farm Laws: ఆందోళనలు ఆగవు.. చట్టాల రద్దు సరే.. మద్దతు ధరపైనా మాతో చర్చించాలి: రైతులు

ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనను సంయుక్త కిసాన్ మోర్చా స్వాగతించింది. అయితే, సాగు చట్టాల ప్రక్రియ పార్లమెంటులో పూర్తయ్యే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అంతేకాదు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉన్నదని తెలిపింది .మద్దతు ధరపైనా ప్రభుత్వం తమతో చర్చించాలని డిమాండ్ చేసింది.

 

will not stop protest till farm laws scrapped in parliament.. says farmers
Author
New Delhi, First Published Nov 19, 2021, 12:46 PM IST

న్యూఢిల్లీ: వివాదస్పదమైన మూడు సాగు చట్టాల(Farm Laws)ను రద్దు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) చేసిన ప్రకటనను రైతు సంఘాలు(Farmer Organisations) స్వాగతించాయి. 40 రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(Samyukt Kisan Morcha) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటనను స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ విజయాన్ని తమ పోరాటంలో అసువులు బాసిన సుమారు 700 మంది రైతుల(Farmers)కు అంకితం చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పోరాటంలో తమకు ప్రజలు, సామాజిక సంస్థలు, పాత్రికేయులు ఎంతో మద్దతుగా నిలిచారని వివరించింది.

ప్రధాన మంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. అయితే, ఆ ప్రకటన పార్లమెంటులో అమలయ్యే  వరకు ఎదురుచూస్తామని వివరించింది. రేపు సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులు సమావేశం కానున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలోనే తదుపరి కార్యాచరణను వెల్లడించనుంది. పార్లమెంటులో చట్టాలు రద్దు అయ్యే వరకు నిరసన ప్రాంతాలను వదిలిపెట్టేది లేదని రైతు ఆందోళనకారులు చెప్పారు. తమ ఆందోళన కేవలం మూడు సాగు చట్టాల రద్దు కోసం మాత్రమే జరగలేదని, వాటితో పాటు దేశవ్యాప్తంగా రైతులందరికీ అన్ని పంటలపై కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కోసమూ ఈ పోరాటం చేస్తున్నామని ఎస్‌కేఎం తెలిపింది. కనీస మద్దతు ధర తమ రెండో అతిపెద్ద డిమాండ్ అని బీకేయూ(లఖోవాల్) జనరల్ సెక్రెటరీ హరిందర్ సింగ్ లఖోవాల్ తెలిపారు. కాబట్టి, కనీస మద్దతు ధరపై ప్రభుత్వం తమతో చర్చించాలని డిమాండ్ చేశారు. కాగా, సాగు చట్టాల రద్దు ప్రక్రియ పార్లమెంటులో పూర్తయ్యే వరకు వెనుదిరగబోమని వివరించారు.

Also Read: farm laws repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ

కాగా, ఈ ప్రకటనపై రైతు నేత రాకేష్ టికాయత్ స్పందించారు. పార్లమెంటులో సాగు చట్టాలు రద్దయ్యే వరకు తాము నిరసన ప్రాంతాలను వదిలిపెట్టమని, తమ ఆందోళనలను ఆపబోమని స్పష్టం చేశారు. దీనితోపాటు ఇతర అంశాలపైనా రైతులతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ప్రధానమంత్రి ప్రకటన తర్వాత సింఘు బార్డర్‌లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రైతు ఆందోళనకారులు సంబురాలు చేసుకున్నారు. రైతులు అందరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటనను స్వాగతించారు. కానీ, కనీస మద్దతు ధరపైనా కచ్చితంగా చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. సాగు చట్టాలను ఈ నెలలో ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో రద్దు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో (parliament winter session 2021) దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. రైతులందరినీ క్షమాపణ కోరుతున్నట్టుగా మోదీ చెప్పారు. రైతులు  ఆందోళన విరమించాలని కోరారు

Follow Us:
Download App:
  • android
  • ios