farm laws repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ
మూడు వ్యవసాయ చట్టాలపై ( three farm laws) కేంద్రం వెనక్కి తగ్గింది. గతేడాది కేంద్రం తీసుకుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ప్రకటించారు.
మూడు వ్యవసాయ చట్టాలపై ( three farm laws) కేంద్రం వెనక్కి తగ్గింది. గతేడాది కేంద్రం తీసుకుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ప్రకటించారు. శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో (parliament winter session 2021) దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. రైతులందరినీ క్షమాపణ కోరుతున్నట్టుగా మోదీ చెప్పారు. రైతులు ఆందోళన విరమించాలని కోరారు. కాగా, ఈ సాగు చట్టాలను రద్దు చేయాలని గత ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇంకా PM Modi మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని చెప్పారు. బడ్జెట్‌లో రైతులకు కేటాయింపులు ఐదు రెట్లు పెరిగాయని తెలిపారు. ‘మేము దేశంలోని గ్రామీణ మార్కెట్లను బలోపేతం చేసాము. చిన్న రైతులను ఆదుకోవడానికి అనేక పథకాలు తీసుకొచ్చాం. రైతులకు బడ్జెట్ కేటాయింపులు ఐదు రెట్లు పెరిగాయి. మైక్రో ఇరిగేషన్‌కు కూడా రెట్టింపు నిధులు ఇచ్చాం’ అని మోదీ తెలిపారు.
చిన్న రైతుల సాధికారత, బలోపేతానికి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని.. ఇది రైతులు, ఆర్థికవేత్తలు, వ్యవసాయ నిపుణుల డిమాండ్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైతులకు సరసమైన ధరలకే విత్తనాలు, 22 కోట్ల సాయిల్ హెల్త్ కార్డుల వంటి సౌకర్యాలను అందించడానికి తాము కృషి చేసినట్టుగా చెప్పారు. వ్యవసాయోత్పత్తిని పెంచడానికి ఇటువంటి అంశాలు దోహదపడ్డాయని వెల్లడించారు. తాము ఫసల్ బీమా యోజనను బలోపేతం చేశామని.. మరింత మంది రైతులను దాని కిందకు తీసుకొచ్చామని మోదీ అన్నారు.
ఇక, పంజాబ్, హర్యానా మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది రైతులు నవంబర్ 28, 2020 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, తమ పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీని ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రైతులతో కేంద్రం 11 రౌండ్ల చర్చలు జరిపింది. ఆ తర్వాత రైతుల ఆందోళలో కొన్ని హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో చర్చలు నిలిచిపోయాయి. అయితే తాజాగా సాగు చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది.