లక్నో: 23 మంది పిల్లలను ఇంట్లో బంధించిన హత్య కేసు నిందితుడు సుభాష్ బాతమ్ భార్యను స్థానికులు రాళ్లతో, ఇటుకలతో కొట్టి చంపారు. సుభాష్ బాతమ్ ను కాల్చి చంపి కమెండోలు పిల్లలను రక్షించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని ఫరుఖాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

సుభాష్ బాతమ్ ను కాల్చి చంపి పిల్లలను రక్షించిన తర్వాత అతని భార్య పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే, స్థానికులు ఆమెను పట్టుకుని చితకబాదారు. రాళ్లు, ఇటుకలతో ఆమెపై దాడి చేశారు ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. అయితే, ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మరణించింది. 

Also Read: పిల్లల్ని బంధించిన నేరస్తుడు: కాల్చి చంపిన కమెండోలు

సుభాష్ బాతమ్ పథకరచనలో భార్య పాలు పంచుకుందా, లేదా అనేది తెలియదు. అయితే, ఆమె పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తన కూతురు జన్మదిన వేడుకలు ఉన్నాయని చెప్పి గ్రామంలోని పిల్లలను సుభాష్ ఇంటికి ఆహ్వానించాడు. 

ఇంట్లోకి వచ్చిన తర్వాత లోపలి నుంచి ఇంటి తలుపులు మూసేసి తుపాకి గురిపెట్టి వారందరినీ బందించాడు. పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి తలుపులు తట్టారు. అయితే, సుభాష్ వారిపై కాల్పులు జరిపాడు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు ఉగ్రవాద నిరోధక విభాగానికి చెందిన కమెండోలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు 

వారు అతనితో సంప్రదింపులు జరిపారు. అయితే అతను వారి మాటలు పట్టించుకోలేదు. వారిపైకి కూడా కాల్పులు జరిపాడు. చివరకు ఆర్థరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి పిల్లలను రక్షించారు. సుభాష్ ను కాల్చి చంపారు. 

Also Read: టెన్షన్: హత్య కేసు నిందితుడి బందీలుగా ఇంట్లో 12 మంది పిల్లలు

ఆ తర్వాత స్థానికులు సుభాష్ భార్యపై దాడి చేశారు .రక్తమోడుతున్న ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది.