లక్నో: పిల్లల్ని బందీలుగా చేసిన పాత నేరస్తుడిని గురువారం నాడు అర్ధరాత్రి ఎన్‌ఎస్ జీ గార్డ్స్ చంపారు. నేరస్తుడి చేతిలో బందీలుగా ఉన్న పిల్లల్ని సురక్షితంగా విడిపించారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మొహ్మదాబాద్ ప్రాంతం కతారియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. మొహమ్మదాబాద్ ప్రాంతం కతారియా గ్రామానికి చెందిన సుభాష్ బథమ్ పాత నేరస్తుడు. గతంలో అతనిపై పలు కేసులు ఉన్నాయి. 

Also read:టెన్షన్: హత్య కేసు నిందితుడి బందీలుగా ఇంట్లో 12 మంది పిల్లలు

తన పుట్టిన రోజు వేడుకకు రావాలంటూ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని తన ఇంటికి పిలిపించుకొన్నాడు. పిల్లల్ని తన ఇంట్లోనే బంధీలుగా ఉంచాడు. పిల్లల తల్లిదండ్రులు పిల్లల కోసం ఆ ఇంటి తలుపులు కొడితే వారిని బెదిరించాడు. దీంతో వారంతా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పిల్లల్ని కాపాడేందుకు స్థానిక పోలీసులు ఎన్ఎస్‌జీ కమెండో సహయం తీసుకొన్నారు. తనపై అక్రమంగా పోలీసులు కేసు పెట్టారని నిందితుడు ఆరోపించాడు. స్థానికులు, ఎమ్మెల్యే కూడ నిందితుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే నిందితుడు కాల్పులకు దిగాడు. 

ఓ నాటు బాంబును కూడ ప్రజలపై విసిరేశాడు. బాంబు దాడిలో ఒకరికి గాయాలయ్యాయి. చిన్నారులను రక్షించేందుకు ఎన్ఎస్‌జీ కమెండోలు రంగంలోకి దిగారు. నిందితుడు లొంగిపోవాలని కోరినా కూడ పట్టించుకోలేదు. దీంతో ఎన్ఎస్ జీ కమెండోలు నిందితుడిని కాల్చి చంపారు. బందీలుగా ఉన్న పిల్లల్ని సురక్షితంగా విడిపించారు.

నిందితుడు సుభాష్ బథంగా పోలీసులు గుర్తించారు. అతడికి మతిస్తిమితం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగానే నిందితుడు పిల్లల్ని బంధించి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.