లక్నో: బెయిల్ పై విడుదులైన ఓ హత్య కేసు నిందితుడు తన భార్యను, ఏడాది వయస్సు గల కూతురిని, 12 మందికిపైగా పిల్లలను నిర్బంధించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరుఖాబాద్ జిల్లాలో గల ఓ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుభాష్ బాతమ్ అనే ఆ వ్యక్తితో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.

తన కూతురు జన్మదిన వేడుకలకంటూ హత్య కేసు నిందితుడు గ్రామంలోని పిల్లలను తన ఇంటికి ఆహ్వానించాడు వాళ్లు ఇంట్లోకి రాగానే తుపాకితో బెదిరించి, తన భార్య, కూతుళ్లతో సహా పిల్లలను నిర్బంధించాడు.

తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో కొంత మంది గ్రామస్థులు వచ్చి ఇంటి తలుపులు తట్టారు. వారిపై సుభాష్ భాతమ్ కాల్పులు జరిపాడు. దాంతో వారు తిరిగి వెనక్కి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారు. దాంతో సుభాష్ భాతమ్ వారిపై టెర్రాస్ పై నుంచి కాల్పులు జరిపాడు. వారిపైకి ఓ నాటు బాంబు కూడా విసిరాడు. కాన్పూర్ ఇన్ స్పెక్టర్ జనరల్ నేతృత్వంలోని ఉగ్రవాద నిరోధక బలగం, పోలీసు బృందం సంఘటనా స్థలంలో ఉన్నాయి.

సుభాష్ బందీలుగా ఉన్న పిల్లలకు ఏం జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ మీడియాకు చెప్పారు. శిక్షణ పొందిన బృందం సంఘటనా స్థలంలో ఉన్నట్లు కూడా తెలిపారు. కమెండోలను కూడా రంగంలోకి దింపినట్లు చెప్పారు. 

బందీలుగా ఉన్న పిల్లలకు ఏం జరగకూడదని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ సుభాష్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. సుభాష్ మానసిక స్థితి బాగా లేకపోవచ్చునని పోలీసులు అంటున్నారు.