పెళ్లైన 15 రోజుల్లోనే భర్తను గొడ్డలితో హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దంపతుల గొడవలే దీనికి కారణమని అనుమానం.

పెళ్లి అంటేనే నేటి సమాజంలో యువకులు బెదిరిపోతున్నారు.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ మరవక ముందే మరో భర్త దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. పెళ్లైన కేవలం 15 రోజులకే భర్తను గొడ్డలితో నరికి చంపిన ఉదంతం తాజాగా బయటపడింది.ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరల ప్రకారం..రాధిక(27) అనే యువతి భర్త అనిల్ లోఖండే(53)ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ సంఘటన పెళ్లి అయిన 15 రోజులకే జరిగింది. మంగళవారం రాత్రి భార్యభర్తల మధ్య ఏదో గొడవ జరిగినట్లు చుట్టుపక్కలవారు చెబుతున్నారు. అయితే, బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత 12:30 గంటల సమయంలో భర్త అనిల్ నిద్రిస్తుండగా రాధిక గొడ్డలితో అతని తలపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తుంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.., అనిల్ లోఖండే మొదటి భార్య క్యాన్సర్‌తో మరణించింది. దీంతో అతడు రాధికను రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన దగ్గర నుండి అనిల్ తన భార్యను శారీరకంగా,మానసికంగా ఇబ్బంది పెట్టేవాడని, దీన్ని తట్టుకోలేక కోపంతో రాధిక హత్య చేసిందని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. రాధికను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను కోర్టులో హాజరు పరచగా, కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.

రాజా రఘువంశి ఘటనలాగే ఇది

ఈ ఘటన వారం క్రితం భార్యను హనీమూన్‌కి మేఘాలయకు తీసుకెళ్లిన భర్త హత్యను గుర్తుకు తెస్తోంది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశిని అతని భార్య సోనమ్ తన ప్రియుడితో, కిరాయి హంతకులతో కలిసి చంపేసింది.