న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను ఉరి తీయడానికి పవన్ జల్లాద్ నే ఎందుకు ఎంపిక చేశారనేది ఆసక్తికరమైన విషయం. నలుగురు దోషులకు తెల్లవారు జామున 5.30 గంటలకు ఉరి వేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ కు చెందిన పవన్ జల్లాద్ వారిని ఉరి తీశాడు. 

తన ముందు తరాలకు చెందినవారి మాదిరిగా పవన్ జల్లాద్ ఉరి తీయడంలో వృత్తిపరమైన నిపుణుడు. తమ తాతముత్తాల నుంచి ఆయన ఉరీ తీయడాన్ని అభ్యసించాడు. తాతముత్తాల నుంచి ఆయనకు అది వారసత్వంగా వచ్చింది. ఉరి తీసే సమయంలో ఆయన ఏ విధమైన తప్పులకు కూడా అవకాశం కల్పించడు.

సినిమాల్లో మాదిరిగా కాకుండా ఆయన జీవితంలో అతి సామాన్యుడు. తన భార్యను, పిల్లలను చూసుకుంటూ జీవితం గడుపుతుంటాడు. ఆర్థికంగా ఆయన కుటుంబ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటోంది. అయినప్పటికీ క్రూరమైన నేరం చేసినవారిని ఉరి తీసే అవకాశం వచ్చినందుకు ఆయన గర్వంగా ఫీలయ్యాడు. పవన్ జల్లాద్ మాదిరిగా అతని చిన్న కుమారుడు కూడా ఆ వృత్తిని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. 

Also Read: నిర్భయ దోషులను ఉరి తీసేటప్పుడు ఎవరెవరు ఉన్నారంటే...

నిర్భయ కేసు దోషులను నలుగురిని తీహార్ జైలులో శుక్రవారం ఉదయం సరిగ్గా 5.30 గంటలకు ఉరి తీశారు. పవన్ జలాద్ వారికి ఉరేశాడు. వారిని ఉరి తీయడానికి మూడు సార్లు కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. చివరకు మూడో డెత్ వారంట్ అమలైంది. దాదాపు ఏడున్నరేళ్ల తర్వాత నిర్భయ కేసు దోషులకు శిక్ష పడింది. 

ముకేష్ సింగ్  సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ (31)లకు ఉరి శిక్ష పడింది. ఈ నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు నిందితులు ఉండగా, ఒకతను మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: చివరి కోరిక తీర్చండి.. ఉరికి ముందు నిర్భయ దోషి వినయ్ తల్లి

2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఆరుగురు వ్యక్తులు వైద్యవిద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 రోజుల తర్వాత 2012 డిసెంబర్ 29వ తేదీన ఆమె మరణించింది.