Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ఎందుకు ప్రకటించలేదు.. ?

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. గుజరాత్‌ గురించి ప్రస్తావించకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోడీ సొంత రాష్ట్రం కావడం వల్లే ఈసీ చేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 
 

why gujarat poll dates not announced with himachal pradesh
Author
First Published Oct 14, 2022, 7:34 PM IST

దేశంలో ఎన్నికల సందడి మొదలయ్యింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. నిజానికి ఈరోజే గుజరాత్ అసెంబ్లీకి కూడా తేదీలను ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అందుకు విరుద్ధంగా కేవలం హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే షెడ్యూల్‌ను విడుదల చేశారు సీఈసీ. దీంతో రాజకీయ విశ్లేషకులు షాకయ్యారు. నిజానికి ఇరు రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం ఆరు నెలల వ్యవధిలోనే ముగియనుంది. అందువల్ల హిమాచల్‌ది ప్రకటించి.. గుజరాత్‌ గురించి ఏ ప్రకటనా లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనికి ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు. 

రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ముగిసే సమయానికి 40 రోజుల గ్యాప్ వుంది. నిబంధనల ప్రకారం.. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక ఫలితం , మరొకదానిపై ప్రభావం చూపకుండా వుండటానికి కనీసం 30 రోజులు వుండాలని సీఈసీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగుస్తుండగా.. గుజరాత్ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18తో ముగియనుంది. వాతావరణంతో పాటు అనేక కారణాల వల్ల హిమాచల్ ఎన్నికల తేదీలను కాస్త ముందుగా ప్రకటించామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. 

2017లోనూ ఇదే సంప్రదాయం ప్రకారం ఎన్నికలు జరిగాయని.. ఆ ఏడాది అక్టోబర్ 13న హిమాచల్ ప్రదేశ్‌కు, అక్టోబర్ 25న గుజరాత్‌కు షెడ్యూల్ ప్రకటించామని ఆయన స్పష్టం చేశారు. మంచు కురవడానికి ముందే హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలను నిర్వహించాలనుకుంటున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి పలువురితో సంప్రదింపులు జరిపామని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి హిమాచల్ ప్రదేశ్‌కు తక్కువ రోజులకు (70కి బదులుగా 57 రోజులు) వర్తిస్తుందన్నారు. 

అయితే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సీఈసీ ఇచ్చిన వివరణ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడం వల్లే ఎన్నికల సంఘం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీకి వ్యతిరేక ఫలితం వస్తే.. దాని ప్రభావం గుజరాత్‌పై పడకుండా ఉండేలా ఈసీ వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. 

ALso Read:నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, షెడ్యూల్ ఇదే.. 80 ఏళ్లు నిండితే ఇంటి నుంచే ఓటు

ఇకపోతే.. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు వుంటుందని ఆయన చెప్పారు. అక్టోబర్ 17న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని.. 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 27న నామినేషన్లను పరిశీలిస్తామని, అక్టోబర్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. 

హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే.. ఇక్కడ మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 43, కాంగ్రెస్ 22 స్థానాలను దక్కించుకున్నాయి. జనవరి 8, 2023తో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ నిరుద్యోగం, పేదరికం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. 

అటు ... ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సొంత రాష్ట్రమైన గుజరాత్ విషయానికి వస్తే.. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి సంబంధించి 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 99, కాంగ్రెస్‌ 77 స్థానాలను దక్కించుకున్నాయి. పలుమార్లు ఉపఎన్నికలు జరిగిన కారణంగా ఇక్కడ బీజేపీ బలం 111కే చేరింది. ఈసారి ఈ రెండు జాతీయ పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ షాకిచ్చేందుకు సిద్ధమైంది. నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై హామీలు ఇస్తూ యువతను లక్ష్యంగా చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios