రాహుల్ గాంధీని మోడీ ఇంటి పేరు కేసులో దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనితో ఆయనను తిరిగి పార్లమెంటు సభ్యుడిగా వెంటనే చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్‌కు అవసరమైన డాక్యుమెంట్లు అందించారు. సోమవారం ఆయన పార్లమెంటులో అడుగు పెడతారా? లేదా? అన్నది చూడాలి.
న్యూఢిల్లీ: మోడీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత ఆయన పార్లమెంటు సభ్యత్వ పునరుద్ధరణ గురించి చర్చ మొదలైంది. ఇండియా కూటమిగా ప్రతిపక్షాలు అన్నీ ఏకం కావడం, మణిపూర్ హింసపై ప్రధాని మోడీతో పార్లమెంటులో మాట్లాడించాలని సంకల్పించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, దీనిపై ఈ వారంలో చర్చ జరగనుండటం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో ఉండాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అందుకే, అటు సుప్రీంకోర్టు ఆయనను దోషిగా నిర్దారించడంపై స్టే విధించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆయనను తిరిగి పార్లమెంటుకు తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియను ప్రారంభించింది.
ఇప్పుడు రాహుల్ గాంధీని తిరిగి పార్లమెంటు సభ్యుడిగా పునరుద్ధరించడానికి ఏర్పాటు చేయాల్సినవన్నీ కాంగ్రెస్ నేతలు చేశారు. అందుకు సంబంధించిన అన్ని పేపర్లను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ముందు ఉంచారు. ఆయన సంతకం పెట్టడమే తరువాయి రాహుల్ గాంధీ పార్లమెంటుకు వస్తారని పార్టీ నేతలు, విపక్ష కూటమి ఇండియా నేతలు ఎదురుచూస్తున్నారు.
ఒక వేళ స్పీకర్ సకాలంలో స్పందించకుండా జాప్యం వహిస్తే కోర్టును ఆశ్రయించాలనీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు, పార్లమెంటు సభ్యుడిగా ఆయనపై అనర్హత వేటు ఎంత వేగంగా వేశారో.. అంతే వేగంగా ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించకుంటే విపక్షాలు అన్నీ ఐక్యంగా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తాలనీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
Also Read : ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం.. అసెంబ్లీ నిరవధిక వాయిదా
గతంలో లక్షద్వీప్ ఎంపీ పీపీ మొహమ్మద్ ఫైజల్‌ను తిరిగి పార్లమెంటులో చేర్చుకోవడానికి దీర్ఘ సమయం తీసుకున్నారు. ఆయనకు పడిన పదేళ్ల జైలు శిక్షను కేరళ హైకోర్టు కొట్టివేసినా పార్లమెంటు సకాలంలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. చివరకు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కావడానికి ముందు మార్చిలో ఆయనను తిరిగి పార్లమెంటులోకి తీసుకున్నారు.
