టీఎస్ఆర్టీసీ బిల్లుకు ఎట్టకేలకు ఆదివారమే అసెంబ్లీలో ఆమోదం లభించింది. దీంతో అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ బిల్లు పై సస్పెన్షన్ నేపథ్యంలోనే మరో రెండు రోజులు సమావేశాలను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, బిల్లుకు ఆమోదం లభించడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు ఎట్టకేలకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ బిల్లుకు అనుమతి తెలుపడంతో ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దానికి ఆమోదం కూడా వెనువెంటనే జరిగిపోయాయి. అనంతరం, అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది.
ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు మనీ బిల్లు కావడంతో గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. కానీ, పలుమార్లు ఆ బిల్లుపై వివరణలు కావాలంటూ గవర్నర్ ప్రభుత్వం నుంచి సమాచారం అడగడం చర్చనీయాంశమైంది. ఆర్టీసీ కార్మికులూ ధర్నా చేశారు. ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండటంతో గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదాన్ని జాప్యం చేయడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించాలని నిర్ణయించింది. కానీ, గవర్నర్ అనుమతి రావడంతో బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించుకుంది. దీంతో రెండు రోజులు పొడిగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
గురువారం మొదలైన అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులపాటు కొనసాగాయి. తొలిరోజు ఎమ్మెల్యే సాయన్నకు నివాళి అర్పించడంతో పెద్దగా చర్చలేమీ లేకుండానే ముగిసింది. ఆ తర్వాత వరద నష్టాలు, గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను ప్రభుత్వం మరోసారి ఆమోదించుకుంది. చివరి రోజున ఆర్టీసీ బిల్లుకు ఆమోదం పొందింది.
Also Read: పొడుస్తున్న పొద్దు అస్తమించింది .. ప్రజా పోరాటాల మహా శిఖరం ఒరిగింది , గద్ధర్ ఫోటో గ్యాలరీ
అసెంబ్లీలో సీఎం ప్రసంగం చేస్తూ తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాతి పరిణామాలను గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్తలు చెప్పారు. సీఎం ప్రసంగం అనంతరం, మంత్రి పువ్వాడ అజయ్ ఆర్టీసీ విలీనం బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. దానికి శాసన సభ ఆమోదం తెలిపంది. అలాగే, కేటీఆర్ పురపాలక చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకూ ఆమోద ముద్ర వేసింది.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ సభ సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎనిమిది సెషన్‌లలో సభ్యులు సహకరించారని వివరించారు. 2019 జనవరి 18న తాను శాసన సభ స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్నట్టు పోచారం వివరించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ఈ ప్రభుత్వ హయాంలో ఇవే చివరి సమావేశాలు కావడం గమనార్హం.
