దేశంలో గోధుమ పంట ఉత్పత్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. గతేడాదితో పోలిస్తే 3 శాతం మేర ఉత్పత్తి తగ్గిపోతుందని... కానీ ఆహార ధాన్యాల మొత్తం దిగుబడులు  మాత్రం పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. 

భారతదేశంలో ఈ ఏడాది గోధుమల ఉత్పత్తి (wheat production) తగ్గిపోనుంది. గతేడాదితో పోలిస్తే 3 శాతం మేర గోధుమల ఉత్పత్తి తగ్గిపోతుందని కేంద్ర వ్యవసాయ శాఖ (union agriculture department) తాజాగా ప్రకటించింది. 10.6 కోట్ల టన్నులకు పడిపోతుందని పేర్కొంది. 2014 –15 నుంచి గోధుమ దిగుబడి తగ్గిపోవడం ఇదే తొలిసారి అని, దిగుబడి పడిపోవడానికి కారణం వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమేనని ప్రభుత్వం తెలిపింది. గతేడాది 10.9 కోట్ల టన్నుల గోధుమల దిగుబడి రాగా.. ఈ ఏడాది 11.1 కోట్ల టన్నులు వస్తుందని ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ఇప్పుడు వేసవి కాలం త్వరగా వచ్చినందున గోధుమల ఉత్పత్తి 10.5 కోట్ల టన్నులకు పడిపోతుందని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే పేర్కొన్నారు. 

అయితే, తాజా నివేదికలో మాత్రం 3 శాతం పడిపోయి 10.6 కోట్ల టన్నుల గోధుమలు వస్తాయని నిన్న విడుదల చేసిన ఆహారధాన్యాలు, చెరకు, నూనె గింజలు, పత్తి, జూట ఉత్పత్తి మూడో అంచనా నివేదికలో కేంద్ర వ్యవసాయ శాఖ చెప్పింది. గోధుమల దిగుబడి తగ్గినా మొత్తం ఆహార ధాన్యాల దిగుబడులు మాత్రం పెరుగుతాయని వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం 31.4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వస్తాయని తెలిపింది. వరి, జొన్న, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొంది.

Also Read:గోధుమల ఎగుమతి నిషేధంపై సడలింపు.. కేంద్రం కీలక నిర్ణయం

కాగా.. గోధుమల ఎగుమతిని భారత్ గతవారం నిషేధించిన సంగతి తెలిసిందే. కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని అప్పుడు ప్రకటించింది. భారత్‌లో ఆహార సరుకుల ధరలను నియంత్రణలో ఉంచడానికి, ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మరో ప్రకటనలో పేర్కొంది. అయితే, అంతకు ముందే ఇతర దేశాల ప్రైవేటు ప్లేయర్స్‌తో తమతో చేసుకున్న ఒప్పందాల మేరకు ఎగుమతులు ఉంటాయని వివరించింది. అప్పటికే కుదిరిన అన్ని కాంట్రాక్టులను గౌరవిస్తామని పేర్కొంది.

అయితే ఈ నిషేధ నిర్ణయాన్ని కేంద్రం సడలించింది. మే 13వ తేదీలోపే కస్టమ్స్ అధికారుల పరిశీలనకు పంపినవి, వారి సిస్టమ్‌లో నమోదైన గోధుమ ఎగుమతుల ఆర్డర్‌లను సంబంధిత దేశాలకు పంపడానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగానే ఈజిప్టు దేశానికి గోధుమలను పంపే ఆర్డర్‌ను అనుమతించాలని పేర్కొంది.

కాండ్లా పోర్టులో ఈజిప్టుకు పంపాల్సిన గోధుమలను లోడ్ చేశారు. కానీ, ఈ లోడ్ ఈజిప్టుకు బయలుదేరక ముందే కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. కాండ్లా పోర్టులో లోడ్ అవుతున్న గోధుమలను తమ దేశానికి పంపడానికి అనుమతి ఇవ్వాలని ఈజిప్టు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలను ఈజిప్టు దేశానికి పంపాల్సి ఉన్నది. ఇందులో 44,340 మెట్రిక్ టన్నుల గోధులు ఇప్పటికే లోడ్ చేశారు. మరో 17,160 మెట్రిక్ టన్నుల గోధుమలు మిగిలిపోయాయి. ఈ మొత్తం ఆర్డర్‌ను తమ దేశానికి పంపాలని ఈజిప్టు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలను కాండ్లా పోర్టు నుంచి ఈజిప్టు దేశానికి పంపడానికి అనుమతించినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.