Asianet News TeluguAsianet News Telugu

గోధుమల ఎగుమతి నిషేధంపై సడలింపు.. కేంద్రం కీలక నిర్ణయం

గోధుమ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సడలించింది. మే 13వ తేదీలోపే కస్టమ్స్ అధికారులకు పంపిన ఎగుమతి ఆర్డర్‌లను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈజిప్టు దేశానికి గోధుమలు ఎగుమతి చేయడానికి అనుమతి ఇచ్చింది.
 

union govt relaxes wheat export ban.. allows agypt consignment
Author
New Delhi, First Published May 17, 2022, 7:54 PM IST

న్యూఢిల్లీ: గోధుమల ఎగుమతి నిషేధంపై కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధ నిర్ణయాన్ని సడలించింది. మే 13వ తేదీలోపే కస్టమ్స్ అధికారుల పరిశీలనకు పంపినవి, వారి సిస్టమ్‌లో నమోదైన గోధుమ ఎగుమతుల ఆర్డర్‌లను సంబంధిత దేశాలకు పంపడానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగానే ఈజిప్టు దేశానికి గోధుమలను పంపే ఆర్డర్‌ను అనుమతించాలని పేర్కొంది.

కాండ్ల పోర్టులో ఈజిప్టుకు పంపాల్సిన గోధుమలను లోడ్ చేశారు. కానీ, ఈ లోడ్ ఈజిప్టుకు బయలుదేరక ముందే కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. కాండ్లా పోర్టులో లోడ్ అవుతున్న గోధుమలను తమ దేశానికి పంపడానికి అనుమతి ఇవ్వాలని ఈజిప్టు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలను ఈజిప్టు దేశానికి పంపాల్సి ఉన్నది. ఇందులో 44,340 మెట్రిక్ టన్నుల గోధులు ఇప్పటికే లోడ్ చేశారు. మరో 17,160 మెట్రిక్ టన్నుల గోధుమలు మిగిలిపోయాయి. ఈ మొత్తం ఆర్డర్‌ను తమ దేశానికి పంపాలని ఈజిప్టు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలను కాండ్లా పోర్టు నుంచి ఈజిప్టు దేశానికి పంపడానికి అనుమతించినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.

గోధుమ ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం శనివారం నిషేధించిన సంగతి  తెలిసిందే. ఈ ఆదేశం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో చాలా దేశాలకు పంపే గోధుమలు పోర్టుల్లోనే నిలిచిపోయాయి.

అయితే, ఈ నిర్ణయం తర్వాత రెండు రకాల షిప్‌మెంట్లను కేంద్రం అనుమతిస్తుంది. ఆయా దేశాల్లోని ఆహార భద్రత అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఎగుమతులు సాగుతాయి. ఆయా దేశాల విజ్ఞప్తు ల దృష్ట్యా కూడా కేంద్రం ఎగుమతులపై నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే, ఇర్రవకేబుల్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఉన్న దేశాలకూ గోధుమలు ఎగుమతి చేయడానికి కేంద్రం అనుమతులు ఉన్నాయి.

గోధుమల ఎగుమతిని భారత్ గతవారం నిషేధించింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని అప్పుడు ప్రకటించింది. భారత్‌లో ఆహార సరుకుల ధరలను నియంత్రణలో ఉంచడానికి, ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మరో ప్రకటనలో పేర్కొంది. అయితే, అంతకు ముందే ఇతర దేశాల ప్రైవేటు ప్లేయర్స్‌తో తమతో చేసుకున్న ఒప్పందాల మేరకు ఎగుమతులు ఉంటాయని వివరించింది. అప్పటికే కుదిరిన అన్ని కాంట్రాక్టులను గౌరవిస్తామని పేర్కొంది.

జీ7 దేశాలు మాత్రం భారత్ గోధుమల ఎగుమతిని నిషేధించడాన్ని జీర్ణించుకోలేవు. జీ7 దేశాల వ్యవసాయ శాఖమంత్రుల జర్మనీలో సమావేశం అయ్యాయి. జర్మనీ వ్యవసాయ శాఖ మంత్రి భారత నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది.

ఇప్పుడు జీ7 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు భారత్ గోధుమల ఎగుమతిని నిషేధించొద్దని కోరుతున్నాయని, కానీ అప్పుడు ఆ దేశాలు స్వయంగా ఫుడ్ మార్కెట్ సప్లైని స్థిరీకరించడానికి ఎందుకు ఎగుమతులు పెంచడం లేదని ప్రశ్నించింది. ప్రపంచంలో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు భారత్ కావచ్చు.. కానీ, ఎగుమతుల్లో మాత్రం భారత్ వాటా స్వల్పమేనని వివరించింది. కానీ, అభివృద్ధి చెందిన దేశాలు అంటే యూఎస్, కెనడా, ఈయూ, ఆస్ట్రేలియాలు ప్రధాన గోధుమ ఎగుమతి దేశాలు అని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios