Asianet News TeluguAsianet News Telugu

Bangalore Rave Party : అసలు ఏమిటీ రేవ్ పార్టీ..? ఎలా జరుపుకుంటారు? సినీతారల పనేంటి?

బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు సినీతారల పేర్లు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటి? ఎలా జరుపుకుంటారు? సినీతారల పనేంటి? అన్నది చాలామంది అనుమానం. అందుకోసమే రేవ్ పార్టీపై స్పెషల్ స్టోరీ... 

What is a Rave Party..? AKP
Author
First Published May 22, 2024, 10:51 AM IST

రేవ్ పార్టీ ... ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. బెంగళూరు శివారులోని ఓ ఫార్మ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసుల దాడి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు సినీతారలు, రాజకీయ ప్రముఖులు ఈ పార్టీలో పాల్లొన్నట్లుగా ప్రచారం జరుగుతుండమే అందుకు కారణం. అయితే రేవ్ పార్టీ అని వినడమే తప్ప చాలామందికి ఇందులో ఏం జరుగుతుందో తెలియదు. దీంతో అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి? ఎలా జరుపుకుంటారు? ఇది చట్ట విరుద్దమా... ఇందులో పాల్గొనడం నేరమా? ఈ కల్చర్ ఎక్కడినుండి వచ్చింది? అనే ప్రశ్నలు మెదులుతున్నాయి. కాబట్టి రేవ్ పార్టీ గురించి తెలుసుకుందాం. 

రేవ్ పార్టీ అంటే ఏమిటి...?
 
ఒక్కప్పటి ఇండియా వేరు... ఇప్పుడున్న ఇండియా వేరు. సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోయింది. దేశం అభివృద్ది చెందుతోంది... ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి కాబట్టి కల్చర్  లో తేడా వచ్చేసింది. ఇలా కాలంతో పాటు యువత బిహేవియర్ కూడా మారతూ వస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ కల్చర్ కు అలవాటుపడ్డ యువత మరింత ఎంజాయ్ చేసేందుకు నిర్వహిస్తున్నవే ఈ రేవ్ పార్టీలు. 

నేటి టెక్నాలజీ యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఉన్నత చదువుల కోసమో, ఉపాధి కోసమో భారత్ నుండి విదేశాలకు వెళ్ళేవారి సంఖ్య భారీగా పెరిగింది. అలాగే కేవలం ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు విహారయాత్రకు వెళ్లేవారు పెరిగిపోయారు. దీంతో పాశ్చాత్య కల్చర్ మన దేశంలోకి ఎంటర్ అయ్యింది. విదేశాల్లో మరీముఖ్యంగా బ్రిటన్, అమెరికా వంటి అడ్వాన్సుడ్ కల్చర్ కలిగిన దేశాల్లోనే భారతీయులు ఎక్కువ. కాబట్టి అక్కడి కల్చర్ ను బాగా వంటపట్టించుకుని స్వదేశానికి వస్తున్నవారు ఇక్కడివారికి పార్టీ కల్చర్ ను కొంతపుంతలు తొక్కిస్తున్నారు. ఇలాంటిదే రేవ్ పార్టీ.  

రేవ్ పార్టీ ఏర్పాటు అంత ఆషామాషీ వ్యవహారం కాదు.  సాధారణంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మామూలు హంగామా వుండదు. కానీ రేవ్ పార్టీ అలాకాదు... సినీ తారలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నా అంతా గోప్యంగా వుంటుంది. ఎందుకంటే ఈ పార్టీ జరిగే పద్దతి అలాంటిది కాబట్టి. 

రేవ్ పార్టీలో బడాబాబుల పిల్లలకే ఎంట్రీ. వారిని ఆకర్షించేందుకు సినీ తారలను రంగంలోకి దింపుతారు నిర్వహకులు. అంతేకాదు మద్యంతో పాటు డ్రగ్స్ కూడా ఏర్పాటుచేస్తారు. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే అమ్మాయిలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా విచ్చలవిడితనానికి నిలువెత్తు రూపమే  ఈ రేవ్ పార్టీలు. చెవులు పగిలే మ్యూజిక్ కు మద్యం, డ్రగ్స్ మత్తులో చిందులేయడం... అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతూ ఎంజాయ్ చేయడమే ఈ రేవ్ పార్టీ కల్చర్. అందువల్లే యువత చాలా ఈజీగా ఈ రేవ్ పార్టీలకు అలవాటుపడుతున్నారు... నిర్వహకులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. 

రేవ్ పార్టీ ఎక్కడ పుట్టింది : 

రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950 సమయంలో ఇంగ్లాండ్  లో మొదలయ్యింది... మెల్లిమెల్లిగా ఇది ప్రపంచానికి పాకింది. ఇండియాలోకి ఈ కల్చర్ కాస్త ఆలస్యంగా వచ్చినా... ఇప్పుడది ప్రతిచోటికి పాకింది. గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో మొదట రేవ్ పార్టీలు జరుగుతుండేవి.. కానీ ఇప్పుడవి ప్రతి నగరానికి పాకాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఐటీ నగరాల్లో ఈ రేవ్ పార్టీలు పరిపాటిగా మారాయి. 

ఎలా జరుపుకుంటారు..: 

రేవ్ పార్టీ నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారం. కాబట్టి అందులో పాల్గొనాలన్నా భారీగా డబ్బులు చెల్లించాల్సి వుంటుంది. ఇక చట్టవిరుద్దంగా డ్రగ్స్, అమ్మాయిలు వుంటారు... సినిమా వాళ్లు కూడా పాల్గొంటారు కాబట్టి గోప్యత చాలా ముఖ్యం. అందువల్లే బాగా తెలిసినవారు, డబ్బున్నవారికే ఎంట్రీ వుంటుంది. 

నగరాలకు దూరంగా వుండే ఫార్మ్ హౌస్ లు, రిసార్ట్ లలోనే ఈ రేవ్ పార్టీలు జరుగుతుంటాయి. పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టినా ఎవరికీ  తెలియకుండా వుండేలా జాగ్రత్త పడతారు. ఇక మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తుంటారు. పార్టీలో పాల్గొనే యువతీయువతులు ఏం చేసినా అడిగేవారు వుండరు. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే శృంగార కార్యకలాపాల కోసం ప్రత్యేక గదులను కూడా కేటాయిస్తారు. ఇలా మత్తులో ఎంజాయ్ చేయడమే రేవ్ పార్టీ అంటే. 

ఇలా ఓ రోజంతా లేకపోతే రెండుమూడు రోజులు ఎంజాయ్ చేసేలా రేవ్ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఒక్కసారి రేవ్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే చాలు బయటి ప్రపంచంతో సంబంధం వుండదు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ముందుగానే  తీసుకుంటారు... చుట్టుపక్కల సిసి కెమెరాలు కూడా పనిచేయవు. ఇలా ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా భయం లేదనే భరోసాను నిర్వహకులు ఇస్తారు. కాబట్టి రేవ్ పార్టీల్లో యువత రెచ్చిపోతుంటారు. రోజురోజుకు యువతలో ఇలాంటి పార్టీలపై ఆసక్తి పెరుగుతోంది... కాబట్టి బెంగళూరులో మాదిరిగా రేవ్ పార్టీలు బయటపడుతున్నాయి. 

రేవ్ పార్టీలు చట్టవిరుద్దమా ..? 

సాధారణంగా పార్టీలు జరుపుకోవడం వేరు... రేవ్ పార్టీలు వేరు. మద్యంతో కూడిన పార్టీలు, రిసార్టులు, ఫార్మ్ హౌస్ లలో జరిగే పార్టీలకు పోలీసులు అనుమతి తప్పనిసరి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా పార్టీ జరిగితే ఓకే. కానీ డ్రగ్స్, అమ్మాయిలు ఎంటర్ అయితేనే ఆ పార్టీ కాస్త చట్టవిరుద్దంగా మారుతుంది. రేవ్ పార్టీల్లో డ్రగ్స్, అమ్మాయిలు కామన్ కాబట్టి చట్టవిరుద్దమే. ఇలాంటి పార్టీలపై పోలీసులు దాడిచేసి నిర్వహకులను అరెస్ట్ చేస్తుంటారు. అలాగే పార్టీలో పాల్గొన్నవారు డ్రగ్స్ తీసుకున్నారో లేదో నిర్ణయించేందుకు టెస్టులు చేయిస్తుంటారు. ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. 

అశ్లీల కార్యకలాపాలకు కూడా రేవ్ పార్టీలు అడ్డాగా మారాయి. స్వయంగా నిర్వహకులే అమ్మాయిలను సరఫరా చేస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూసాయి. కాబట్టి ఇలాంటి రేవ్ పార్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 

  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios