కరోనా థర్డ్ వేవ్: కేసులు పెరగడంతో ఆ పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్
చైనా మొదలు యూకే వరకు కరోనా కేసులు పెరుగుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెలువడుతున్నాయి. వేగంగా వ్యాప్తిచెందే సామర్థ్యమున్న డెల్టా వేరియంట్లు ముఖ్యంగా ఈ ఆందోళనలకు ప్రధాన భూమికగా ఉన్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు మళ్లీ అమల్లోకి వస్తున్నాయి. తాజాగా, పశ్చిమ బెంగాల్‌లోని ఓ పట్టణంలో కఠిన లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో Corona Virus Cases ఆందోళనకరంగా పెరిగాయి. దుర్గా నవరాత్రి ఉత్సవాలతో ప్రజలు బయట గుమిగూడటం.. వేడుక చేసుకోవడాలు జరిగాయి. ఫలితంగా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. కట్టడి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మళ్లీ గతంలో మాదిరిగానే ఓ పట్టణంలో సంపూర్ణ Lockdown విధించింది. కేవలం మెడిసిన్స్, పాలు, రేషన్ సరుకులు, ఎలక్ట్రికల్ గూడ్స్ మినహా అన్ని షాపులూ మూసేయించింది.
West Bengalలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో కేసులు పెరిగాయి. ముఖ్యంగా సోనార్‌పూర్ మున్సిపాలిటీలో ఇవి అధికంగా రిపోర్ట్ అయ్యాయి. ఈ ఏరియా రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏరియాలో కఠిన లాక్‌డౌన్ విధించింది. ఇప్పటి వరకు సోనార్‌పూర్‌లో 19 కంటైన్‌మెంట్ జోన్లను అధికారులు గుర్తించారు.
కేసులను కట్టడి చేయడానికి సోనార్‌పూర్ మున్సిపాలిటీ ఏరియాలో అధికారులు మూడు రోజులపాటు కఠిన లాక్‌డౌన్ విధించారు. ఈ ఆంక్షలపై అధికారులు శనివారం మరోసారి భేటీ కానున్నారు. ఆ సమావేశంలో కరోనా పరిస్థితులను సమీక్షించి లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: అలర్ట్: భారత్‌లోనూ AY.4.2 వేరియంట్ జాడలు ... మధ్యప్రదేశ్‌లో ఆరుగురిలో గుర్తింపు
బెంగాల్‌లో వరుసగా రెండు రోజులుగా 800లకు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఇక్కడ 805 కొత్త కేసులు నమోదవ్వగా, మంగళవారం 806 కేసులు రిపోర్ట్ అయ్యాయి. అంతకు ముందు రెండు రోజులు సుమారు వెయ్యి కేసులు నమోదయ్యాయి. మంగళవారానికి రాష్ట్రంలో మొత్తం కేసులు 15,88,066కి చేరాయి. కొత్తగా 15 మంది కరోనాతో మరణించగా మహమ్మారి కారణంగా మరణించినవారి మొత్తం సంఖ్య 19,081కి పెరిగాయి.
పండుగ సీజన్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌కు కరోనాపై ముందు జాగ్రత్తల సూచనలు చేసింది. కరోనా కేసులు, మరణాలపై సమీక్ష నిర్వహించి కట్టడి చర్యలు అమలు చేయాలని తెలిపింది.
ఇప్పటికే డెల్టా సబ్ వేరియంట్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఈ కేసులు రిపోర్ట్ అయ్యాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక్క రోజే మూడు కేసులు నమోదవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డీ రందీప్ తాజాగా విలేకరులతో ఈ విషయంపై మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు Delta ఏవై.4.2 వేరియంట్ కేసులున్నాయని వెల్లడించారు. ఇందులో మూడు కేవలం బెంగళూరు నగరంలోనే ఉన్నాయని తెలిపారు. మిగతా నాలుగు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని, ఇప్పటికీ కట్టడి చర్యలు తీసుకుంటున్నదని వివరించారు.
Also Read: చైనాలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. డెల్టా వేరియంట్ విజృంభణ.. మరో ముప్పు తప్పదా?
ఈ వేరియంట్ కారణంగానే చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌లు విధిస్తున్నారు. దేశంలోని 11 ప్రావిన్స్‌లలో కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నాటికి 133 కేసులు రిపోర్ట్ అయ్యాయని, ఇందులో 106 కేసులు 13 టూర్ బృందాల్లో నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ఈ టూరిస్టు బృందాలు ఒక ప్రావిన్స్ నుంచి ఇతర ప్రావిన్స్‌లకు పర్యటించారని వివరించారు. ఇన్నర్ మంగోలియా, గన్షు, నింగ్జియా, గుజౌ, బీజింగ్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కట్టడి చర్యలు కఠినంగా అమలవుతున్నాయి.