చైనాలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. డెల్టా వేరియంట్ విజృంభణ.. మరో ముప్పు తప్పదా?
కరోనా వైరస్ తొలిసారిగా వెలుగుచూసిన చైనాలో కేసులు మరోసారి పెరుగుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యమున్న డెల్టా వేరియంట్ కేసులు దేశంలో కనీసం 11 ప్రావిన్స్‌లలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య స్వల్పంగా ఉన్నా విస్తరణలో చాలాప్రాంతాల్లో కేసులు నమోదు కావడం ఆందోళనలు కలిగిస్తున్నాయి. సమీప భవిష్యత్‌లో కేసులు ఒక్కసారిగా బద్దలయ్యే అవకాశమున్నదని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ: చైనా అంటే ఇప్పుడు అందరికీ వెంటనే కరోనా వైరస్ కూడా గుర్తుకువస్తుంది. Coronavirus తొలి కేసు ఈ దేశంలో వెలుగు చూడటమే ఇందుకు కారణం. తర్వాత ఆ pandemic విశ్వవ్యాపితమై విశ్వరూపాన్ని చూపించింది. ప్రపంచాన్ని వణికించింది. వైరస్ ఉత్పరివర్తనాలతో ఇప్పటికీ ఈ ముప్పు నుంచి ఇంకా తేరుకోలేదు. పాశ్చాత్య దేశాలు కరోనాతో పోరాడుతుంటే.. Chinaలో వైరస్ లోడ్ తగ్గుముఖం పట్టింది. కానీ, తాజాగా మళ్లీ ఈ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా Delta వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చైనాలో కరోనా తాజా విజృంభణకు బయటిదేశాల నుంచి వ్యాపించిన డెల్టా వేరియంటే కారణమని నేషనల్ హెల్త్ మిషన్ అధికారి వూ లియాంగ్‌యూ వివరించారు. ఇక్కడ కేసులు ఒక ప్రదేశానికి, ఒక ప్రావిన్స్‌కు పరిమితమైతే ఇంత ఆందోళన ఉండేది కాదు. కానీ, వారం వ్యవధిలోనే మొత్తం 11 ప్రావిన్స్‌లకు వైరస్ వ్యాపించింది. కరోనా వైరస్ సోకిన చాలా మంది పేషెంట్లు ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్‌కు ప్రయాణించారని కమిషన్ ప్రతినిధి మీ ఫెంగ్ వివరించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్న ప్రాంతాలు వెంటనే ఎమర్జెన్సీ మోడ్‌లోకి వెళ్లాలని సూచించారు. చైనాలో ఇన్నర్ మంగోలియాలోని ఎజీనా కౌంటీలో ఇప్పటికే కఠిన చర్యలు అమల్లోకి వచ్చాయి. సోమవారం నుంచి ప్రతి ఒక్కరు ఇంటి గడప దాటవద్దని, ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది. గన్షు, ఇన్నర్ మంగోలియా ప్రావిన్స్‌లోని కొన్ని నగరాల్లో ట్యాక్సీలు, బస్సులను నిలిపేశారు.
Also Read: ఇండియాలో 15,906 కోవిడ్ కేసులు: భారీగా పెరిగిన మరణాలు
చైనా రాజధాని బీజింగ్‌లోనూ మూడు జిల్లాల్లో వైరస్ వ్యాపించినట్టు బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వైస్ హెడ్ ప్యాంగ్ జింగువో వివరించారు. వైరస్ కారణంగా బీజింగ్‌లో నిర్వహించాలనుకున్న ఓ మ్యారథాన్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. కరోనా మహమ్మారి సోకిన వారు బయట తిరగడంపై లేదా సిటీకి రావడంపై నిషేధాన్ని విధించింది.
విదేశాల నుంచి వచ్చినవారిలో కరోనా కేసులు రిపోర్ట్ కావడమే కాదు.. దీని ద్వారా స్థానిక కేసులూ పెరుగుతున్నాయి. శనివారం ఒక్క రోజే దేశంలో 26 స్థానిక cases నమోదయ్యాయి. ఇందులో ఇన్నర్ మంగోలియాలో ఏడు, గన్షులో ఆరు, నింగ్జియాలో ఆరు, బీజింగ్‌లో నాలుగు, హెబెయ్‌లో ఒకటి, హునాన్, షాంగ్జిలలో ఒక్కోటి చొప్పున స్థానికంగా కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. కేసులు తక్కువమొత్తంలో రిపోర్ట్ అవుతున్నా.. చాలా ప్రావిన్స్‌లలో రిపోర్ట్ కావడం ఆందోళనలు కలిగిస్తున్నాయి. సమీప భవిష్యత్‌లో ఈ కేసులు భారీగా రిపోర్ట్ కావడం తథ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో కేసులు పీక్‌కు చేరితే అన్ని దేశాలకూ ముప్పేనని ఇటీవలి చరిత్రే చెబుతున్నది.