దేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శాంతి, ఐక్యతా సందేశం ఇవ్వాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కోరారు. ఈ విషయంలో తమ పార్టీ ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిందని, అయినా ఎలాంటి ప్రతిస్పందనా రావడం లేదని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీని దేశానికి శాంతి, ఐక్యతా సందేశం ఇవ్వాలని తమ పార్టీ నిరంతరం కోరుతోందని, అయినా అది ఫలించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఉదయ్ పూర్ ఘటన, దాని తరువాత మారిని ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలు నెలకొని ఉన్న సమయంలో ప్రధాని ఎందుకు శాంతి సందేశం ఇవ్వడం లేదో తనకైతే అర్థం కావడం లేదని చెప్పారు.
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేత దారుణ హత్య.. గన్‌తో ఫైర్ చేసి.. కత్తులతో పొడిచి
‘‘ దేశానికి శాంతి, ఐక్యత సందేశాన్ని ఇవ్వాలని మేము పదేపదే పీఎం మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేస్తే అది దేశంపై చాలా ప్రభావం చూపుతుంది. కానీ ఆయన ఎందుకు ఇలా చేయడం లేదో నాకు అయితే అర్థం కాలేదు. ఆయనకు అలాంటి సలహా ఇస్తున్న సలహాదారు ఎవరు ? ఆయన విజ్ఞప్తి చేస్తే ఇలాంటి ఘటనలు జరగవని నేను నమ్ముతున్నాను.’’ అని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేసినందుకు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ అనే టైలర్ ను ఇద్దరు వ్యక్తులు హతమర్చారు. దీని తరువాత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అశోక్ గెహ్లాట్ ఈ వాఖ్యలు చేశారు. కాగా కన్హయ్య లాల్ కుమారులిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం ప్రకటించారు.
“కన్హయ్య లాల్ కుటుంబ పరిస్థితిని చూసిన తర్వాత, పిల్లలిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మేము సకాలంలో నిర్ణయం తీసుకున్నాము, ఇది మా కర్తవ్యం.. అయినప్పటికీ మన క్రమశిక్షణను సజీవంగా ఉంచుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను.’’ అని సీఎం గెహ్లాట్ అన్నారు. మరణించిన కన్హయ్య లాల్ కుటుంబానికి జీవనోపాధికి మరే ఇతర ఆధారం లేదని గుర్తించామని సీఎం అన్నారు. మృతుడి కుమారులకు ఉద్యోగం కల్పిస్తే వారి జీవితం సాఫీగా సాగిపోతుందని, కుటుంబానికి ఆర్థిక, మానసిక సహాయం అందుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు.
మతసామరస్యానికి.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఘటన ఇది.. !
నూపుర్ శర్మకు మద్దతు ప్రకటించినందుకు కన్హయ్య లాల్ ను దారుణంగా హతమార్చిన ఘటన ను దేశం మొత్తం మర్చిపోకముందే అమరావతిలో మరో వ్యక్తి హత్య జరిగింది. మృతుడు వెటర్నరీ ఫార్మసిస్టుగా పని చేసేవారు. ఆయన కూడా నూపుర్ శర్మకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఆయన హత్యకు గురయ్యారని ఆలస్యంగా గుర్తించారు. ఈ రెండు హత్య కేసులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలపై దర్యాప్తు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పలువురిని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా.. బీహార్ లో కూడా నూపుర్ శర్మకు మద్దతు ప్రకటిస్తూ పోస్ట్ పెట్టిన ఓ యువకుడిని 20 మంది చితకబాదారు.
